9న చంద్రబాబు ప్రమాణస్వీకారం | Chandrababu Naidu To Take Oath As CM On Jun 9 | Sakshi
Sakshi News home page

9న చంద్రబాబు ప్రమాణస్వీకారం

Jun 5 2024 6:10 AM | Updated on Jun 5 2024 6:10 AM

Chandrababu Naidu To Take Oath As CM On Jun 9

రాజధాని ప్రాంతంలో వేదిక 

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి సీఎం పీఠం ఎక్కను­న్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలి­పాయి. రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయుని­పాలెం సమీపంలో సభ ఏర్పాటుచేసి ప్రమాణస్వీ­కారోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నా­రు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మో­దీని, హోం మంత్రి అమిత్‌షాను కలిసిన త­ర్వాత ప్రమాణస్వీకారం, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

తన ప్రమాణస్వీకారానికి మోదీ, బీజేపీ పెద్దలు, ఎన్డీఏ ముఖ్యులను చంద్రబాబు ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాబు ప్రమా­ణస్వీకారోత్సవం సమయంలోనే జన­సేన, బీజేపీ­లకు చెందిన ముఖ్యనేతలు ఒకరిద్దరిని మంత్రు­లుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. మలివిడతలో మరికొందరికి అవకాశం ఇవ్వను­న్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన చేరే అవకాశం ఉందని చెబుతు­న్నారు. ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబును నియమించేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

ఈ మేరకు చంద్రబాబుతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ వర్గాలు లీకులి­చ్చాయి. బాబు ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై స్ప­ష్టత వచ్చే అవకాశముంది. టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవడం, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాక­పోవ­డంతో ఎన్డీఏలో ఆ పార్టీ కీలకంగా మారింది. దీంతో బాబును కన్వీనర్‌గా నియమి­స్తారనే ప్రచా­రం జరుగుతోంది. ఫలి­తాలు వెల్లడైన తర్వాత  చంద్ర­బాబుకు ప్రధాని మోదీ ఫోన్‌చేసి అభినందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు మంగళ­వారం జనసేన కార్యాల­యానికి వెళ్లి పవన్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.

Advertisement
 
Advertisement
Advertisement