ఎన్నికల్ని బహిష్కరిస్తున్నాం

Chandrababu Comments About TDP Boycotting MPTC & ZPTC Elections - Sakshi

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీలో లేం

ఎన్నికలంటే భయం లేదు, కానీ పోటీకి దూరంగా ఉంటాం

కొత్త ఎస్‌ఈసీకి ఎన్నికలు పెట్టే అర్హత ఉందా?: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు

సాక్షి, అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము పోటీలో లేమని ప్రజలు గమనించాలని కోరారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలంటే భయం లేదని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తమకు బహిష్కరించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు. పార్టీ 40 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నారు. పంచాయతీ ఎన్నికల్ని నాలుగు దశల్లో పెట్టారని, ఈ ఎన్నికల్ని ఒకేదశలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన ఎస్‌ఈసీ ఉదయం బాధ్యతలు తీసుకుని సాయంత్రం నోటిఫికేషన్‌ ఇవ్వడం ఏమిటన్నారు. అసలు ఎన్నికలు పెట్టే అర్హత కొత్త ఎస్‌ఈసీకి ఉందా అని ప్రశ్నించారు.

ఎస్‌ఈసీ రబ్బర్‌ స్టాంపుగా మారారని, సీఎం ఏం చెబితే అది చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకు సలహాదారుగా పనిచేసిన వ్యక్తిని ఎస్‌ఈసీగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందే సీఎం, మంత్రులు 8వ తేదీన పోలింగ్, 10న కౌంటింగ్‌ జరుగుతాయని స్టేట్‌మెంట్లు ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత అఖిలపక్ష సమావేశానికి పిలిచారని, ముందురోజు 11 గంటలకు మీటింగ్‌ అని ఆరోజు రాత్రే నోటిఫికేషన్‌ విడుదల చేయడం దారుణమని చెప్పారు. అఖిలపక్షాలను పిలిచి ముందే నోటిఫికేషన్‌ ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలన్నారు. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిని ఎస్‌ఈసీ చేస్తామన్నారని, అది ఏమైందని ప్రశ్నించారు. కరోనా ఉంది ఎన్నికలు వద్దన్న ప్రభుత్వం, కరోనా సెకండ్‌ వేవ్‌ ఉన్న సమయంలో అర్జెంట్‌గా ఎన్నికలెందుకు పెడుతుందో చెప్పాలన్నారు. దొంగ, పోలీస్‌ కలిస్తే ఏం అవుతుందో, ఇప్పుడు అదే అవుతోందని విమర్శించారు. ఈ ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛాయుతంగా జరుగుతాయనే నమ్మకం లేదన్నారు.

ఎన్నికల బహిష్కరణ పట్ల బాధ, ఆవేదన ఉన్నా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో జయలలిత, జ్యోతిబసు వంటి నేతలు కూడా స్థానిక ఎన్నికలను బహిష్కరించారన్నారు. రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, వలంటీర్లు బెదిరించి ఓట్లు వేయించుకున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఫార్స్‌గా తయారయ్యాయన్నారు. వైఎస్సార్‌సీపీ అక్రమాలపై జాతీయస్థాయిలో పోరాడతామన్నారు. దౌర్జన్యాలు, అక్రమాలతో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని, పోటీచేస్తామనే అభ్యర్థులను పోలీసులు బెదిరించారని ఆరోపించారు.

అప్రజాస్వామిక నిర్ణయాల్లో భాగస్వాములం కాలేమన్నారు. బలవంతపు, అక్రమ ఏకగ్రీవాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికలపై కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వమని అడిగామని, అది ఇస్తే పోటీకి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికమని హైకోర్టులో పిటిషన్‌ వేశామని, శనివారం విచారణ జరుగుతుందని తెలిపారు. అవసరమైతే దీనిపై సుప్రీంకోర్టుకు వెళతామని, కలిసి వచ్చే పార్టీలతో కలిసి పోరాడతామని చెప్పారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీతారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. 

పొలిట్‌బ్యూరో సమావేశం 
అంతకుముందు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఎన్నికల్ని బహిష్కరించాలని అప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని సమావేశంలో చర్చకు పెట్టి చంద్రబాబు అందరితో ఉపన్యాసాలు చెప్పించారు. ఆ తర్వాత దాన్ని పొలిట్‌బ్యూరో నిర్ణయంగా చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top