ఇక పక్కాగా అఫిడవిట్‌! | Sakshi
Sakshi News home page

ఇక పక్కాగా అఫిడవిట్‌!

Published Tue, Oct 10 2023 4:14 AM

CEO Vikasraj with the media after announcing the election schedule - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అభ్యర్థులు తమ ఎన్నికల అఫిడవిట్‌లోని ప్రతికాలమ్‌ను ఇకపై తప్పనిసరిగా పూరించాల్సిందే. కుటుంబ సభ్యుల వివరాలు, ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలు తదితర వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశిత నమూనాలోని అఫిడవిట్‌లో పొందుపరచాల్సిందే. ఏ ఒక్క కాలమ్‌ను ఖాళీగా ఉంచినా సంబంధిత అ­భ్యర్థుల నామినేషన్లను తిరస్కరించనున్నారు.

నా­మినేషన్ల పరిశీలనలో అభ్యర్థి తన అఫిడవిట్‌లో ఏ­దైనా కాలమ్‌ను ఖాళీగా ఉంచినట్టు నిర్ధారిస్తే, సద­రు అభ్యర్థికి రిటర్నింగ్‌ అధికారి నోటీసు జారీ చేసి ఆ కాలమ్‌ను నింపాలని కోరుతారు. అయినా కా­లమ్‌ను నింపడంలో విఫలమైతే ఆ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరిస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. 

అభ్యర్థులు నేరచరిత్రను పత్రికల్లో ప్రకటించాలి 
రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో అదనపు సీఈఓ లోకేష్కుమార్, పోలీసు నోడల్‌ అధికారి సంజయ్‌కుమార్‌ జైన్, జాయింట్‌ సీఈఓ సత్యవతితో కలిసి మీడియాతో మాట్లాడారు. అభ్యర్థులు తమ నేర చరిత్రను పత్రికల్లో ప్రకటించాలని, నేర చరిత్ర గల అభ్యర్థులకు ఎందుకు టికెట్‌ ఇవ్వాల్సి వచ్చింది అన్న అంశంపై కారణాలు తెలుపుతూ రాజకీయ పార్టీలు సైతం పత్రికల్లో ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందన్నారు.  

ఇక ఈసీ పరిధిలోకి అధికార యంత్రాంగం  
ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మరుక్షణమే రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చేశారని, వారు ఈసీకి డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్టు పరిగణిస్తామని వికాస్‌రాజ్‌ స్పష్టం చేశారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం 6, ఓటర్ల వివరాల మార్పు కోసం ఫారం 8 దరఖాస్తుల ïస్వీకరణకు గడువు ఈ నెల 31 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆలోగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఓటర్లకు ఎన్నికల్లో ఓటేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలతో సోమవారం తర్వాత అందనున్న ఫారం–7 దరఖాస్తులను ఎన్నికలు ముగిసే వరకు పెండింగ్‌లో పెడతామని వివరించారు. 

వారికి ఇంటి నుంచే ఓటు హక్కు 
దివ్యాంగులు, 80ఏళ్లు పైబడిన ఓటర్లకు తొలిసారిగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు వికాస్‌రాజ్‌ తెలిపారు. ఇందుకోసం ఫారం 12డీ దరఖాస్తు చేసుకోవాలని వారికి సూచించారు. పోలింగ్‌ కేందాల్లో టాయి­లెట్లు, తాగునీరు, ర్యాంపులు, వీల్‌చైర్‌ వంటి కనీస సదుపాయాలు కల్పిస్తామన్నారు.

పోస్టల్‌ బ్యాలెట్లతో పాటు ఈవీఎం బ్యాలెట్లలో సైతం అభ్యర్థుల ఫొటోలు ముద్రిస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలన కోసం తొలిసారిగా ఇంటిగ్రేటెడ్‌ ఎక్స్‌పెండిచర్‌ మానిట­రింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామని చెప్పారు.  మీడియా సర్టిఫికేషన్‌ కమిటీ నుంచి ధ్రువీకరణ పొందిన తర్వాతే వాణిజ్య ప్రకటనలు జారీ చేయాలని రాజకీయ పార్టీలను కోరారు.  

లెక్కలు చూపితే నగదు విడుదల... 
రూ.50వేలకు పైగా నగదు తీసుకెళ్తుంటే తనిఖీల్లో జప్తు చేస్తారని, ఆ నగదుకు సంబంధించిన లెక్కలను చూపిస్తేనే విడిచి పెడ్తారని వికాస్‌రాజ్‌ తెలిపారు. రాజకీయ పార్టీలు ముందుగా సమాచారమిచ్చి నగదును తరలిస్తే వారికి అనుమతి జారీ చేస్తామని వెల్లడించారు.  

పక్కాగా నిబంధనలు అమలు చేయాలి
రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాలు, మార్గదర్శకాలను నిక్కచ్చిగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు(డీఈఓ), జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు సీఈఓ వికాస్‌ రాజ్‌ ఆదేశించారు.

రాష్ట్ర వ్యయ పరిశీలన నోడల్‌ అధికారి మహేశ్‌ భగవత్, కేంద్ర సాయుధ బలగాల నోడల్‌ అధికారి స్వాతి లక్రా, రాష్ట్ర పోలీసు నోడల్‌ అధికారి సంజయ్‌కుమార్‌ జైన్‌తో కలిసి సోమవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలపాలని, వెబ్‌సైట్లలో సైతం ఆలస్యం చేయకుండా మార్పులు చేస్తుండాలని ఆదేశించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement