Caste Politics In Guntur District TDP - Sakshi
Sakshi News home page

ఆయన ఆస్తులు అమ్ముకుంటే.. బాబు మాత్రం వారిని బుజ్జగిస్తున్నారు? కన్నాకూ ఇదే గతి!

Published Sat, Jul 29 2023 5:25 PM

Caste Politics In Guntur District Tdp - Sakshi

జనం ఛీకొట్టినా తెలుగుదేశం నాయకత్వంలో మార్పు రావడంలేదు. ఆ పార్టీలో ఒక్కో కులానికి ఒక్కో న్యాయం అమలవుతోంది. అధికారంలో ఉన్నా అంటే.. అధికారం పోయినా అంతే. చంద్రబాబు సామాజికవర్గ నేతలకు ఇబ్బంది కలిగితే వెంటనే యాక్షన్ ఉంటుంది. ఇతర కులాల నేతలకు ఎంత ఇబ్బంది కలిగించినా పట్టించుకునేవారుండరు. ఇప్పుడిదే గుంటూరు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు గుంటూరు పచ్చపార్టీలో ఏం జరుగుతుంది?

తెలుగుదేశం పార్టీ అంటే ఒక సామాజికవర్గానికి మాత్రమే చెందిన పార్టీ అని తొలి నుంచి ప్రచారం ఉంది. పదవులు ఎవరికి ఇచ్చినా పెత్తనం మాత్రం ఒకే సామాజికవర్గం చేతుల్లో ఉంటుంది. అది చంద్రబాబు సామాజిక వర్గం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బడుగు, బలహీనవర్గాల పార్టీ అని చంద్రబాబు పదే పదే డప్పు కొడుతుంటారు. కాని ఆయన చెప్పేదొకటి.. చేసేదొకటి. బీసీలైతే ఏమాత్రం తేడా వచ్చినా తొక్కేస్తారు. అదే మనోడైతే నెత్తిన పెట్టుకుంటారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పచ్చపార్టీలో ఇదే జరుగుతోంది.

నర్సరావుపేటలో గత ఎన్నికల్లో బీసీ నేత చదలవాడ అరవిందబాబు టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నాలుగేళ్లనుంచి ఇన్‌చార్జిగా పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయంలోనే అరవిందబాబు ఆర్దికంగా ఇబ్బందులు పడ్డారు. అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. గత నాలుగేళ్లుగా సొంత ఆస్తులను సైతం అమ్ముకుని నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీని నడుపుతున్నాడు.
చదవండి: అక్కడ ఆటలు సాగవని అర్థమైంది.. అందుకే గ్లాస్‌లో మునకేశాడా?

మరో ఏడాదిలోగా ఎన్నికలు రానున్న తరుణంలో ఇప్పుడు సడన్ గా చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వర్లు తెరపైకి వచ్చారు. తాము కూడా టికెట్ రేసులో ఉన్నామంటూ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అంతేకాదు కమ్మ సామాజికవర్గం నేతలతో సమావేశమై ఈసారి టికెట్ మన సామాజికవర్గానికే దక్కేలా చూడాలని కులపెద్దలను కోరినట్లు సమాచారం.

అరవిందబాబును కట్టడి చెయ్యడానికి ఒకవైపు నల్లపాటి రాము, మరోవైపు కడియాల వెంకటేశ్వర్లు ఇద్దరూ తెగ పోటీ పడుతున్నారు. ఇన్ చార్జిగా ఉన్న అరవిందబాబును ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనివ్వకుండా ప్రతిరోజూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నల్లపాటి రాము, కడియాల వెంకటేశ్వర్లు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు, లోకేష్ కు ఎన్ని ఫిర్యాదులు చేసినా వారిద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో  నర్సరావుపేటలో టీడీపీ అభిమానులందరూ పార్టీని బతికించడానికి అరవిందబాబు ఆస్తులు అమ్ముకుంటే.. చంద్రబాబు మాత్రం పార్టీని నాశనం చేస్తున్న కమ్మ సామాజికవర్గానికి కొమ్ము కాస్తున్నారని మండిపడుతున్నారు.

పార్టీ నేతలతోపాటు పార్టీకి సపోర్టు చేస్తున్న ఎల్లో మీడియా కూడా బీసీ నేత అరవిందబాబుకు వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తున్నాయి. నర్సరావుపేట పక్కనే ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజికవర్గం నేతలు ఇన్ ఛార్జిని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. రెండు నెలల క్రితం సత్తెనపల్లి టీడీపీ ఇన్ ఛార్జిగా కన్నా లక్ష్మీనారాయణను నియమించారు. కన్నాను ఇన్ ఛార్జిగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ కోడెల శివరాం సొంత కుంపటి ఏర్పాటు చేశారు.

వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించినా ఎటువంటి చర్యలు లేవు. పైగా చంద్రబాబును విమర్శిస్తే పార్టీ నేతలు శివరాంను బుజ్జగించారే కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కన్నా కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం, ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కోడెల శివరాం కమ్మ సామాజికవర్గంకు చెందిన నేత కావడంతోనే పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతుంది.

చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్ మధ్య వార్ నడుస్తోంది. ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నాయకులే. పుల్లారావుకు వ్యతిరేకంగా బాష్యం ప్రవీణ్ నారా ట్రస్ట్ పేరుతో పాగా వెయ్యడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతో ఇద్దరు నేతలు కొట్టుకోవడం మొదలయ్యింది. ఇక్కడ ఇద్దరూ కమ్మ సామాజికవర్గం నేతలు కావడంతో.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా రక్షించుకోవడానికి అధినాయకత్వం మాస్టర్ ప్లాన్ వేసింది.

పుల్లారావును జో కొడుతూ భాష్యం ప్రవీణ్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. షోకాజ్ నోటీసు పేరుతో అగ్ర నాయకత్వం భాష్యం ప్రవీణ్‌ను పిలిపించి బుజ్జగించి పంపించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నా భాష్యం ప్రవీణ్‌పై చర్యలు తీసుకోకపోవడానికి కమ్మ సామాజికవర్గం నేత కావడమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇలా టీడీపీ అధినేత తన సామాజికవర్గానికి ఒక న్యాయం.. మిగతా సామాజికవర్గాలకు మరొక న్యాయం అంటూ రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని గుంటూరు జిల్లాలో టాక్ నడుస్తోంది.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్

Advertisement
Advertisement