కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేశ్‌ నేత 

BRS Lok Sabha MP Venkatesh Netha joins Congress - Sakshi

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్‌ సమక్షంలో చేరిక 

టీటీడీ మాజీ సభ్యుడు  మన్నె జీవన్‌రెడ్డి, మరికొందరు కూడా.. 

సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, పెద్దపల్లి/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి ఎంపీ డాక్టర్‌ బొర్లకుంట వెంకటేశ్‌ నేత ఆ పార్టీకి ఝలక్‌ ఇచ్చారు. కొంతకాలంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ వైఖరితో అసంతృప్తితో ఉన్న ఆయన... ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ గూటి కి చేరారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కల సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత అడుగుపెట్టి నేతలతో సమీక్షించిన రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన టీటీడీ మాజీ సభ్యుడు మన్నె జీవన్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయనతోపాటు ఆ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేత రెహ్మాన్, పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

అనంతరం కేసీ వేణుగోపాల్, రేవంత్‌రెడ్డితో కలిసి వెంకటేష్‌ నేత, మన్నె జీవన్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మ హబూబ్‌నగర్‌), జనంపల్లి అనిరుద్‌రెడ్డి (జడ్చర్ల), గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (దేవరకద్ర), వీర్లపల్లి శంకర్‌ (షాద్‌నగర్‌), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్‌ మల్లు రవి, మాజీ మంత్రి డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

తిరిగి సొంత గూటికి... 
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన వెంకటేశ్‌ నేత 2018 అసెంబ్లీ ఎన్నికలకు మందు రాజకీయల్లోకి వచ్చారు. కాంగ్రెస్‌ తరఫున 2018లో చెన్నూర్‌ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2019లో పెద్దపల్లి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల వేళ తిరిగి సొంతగూటికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

టికెట్‌ ఇస్తే ధర్నా చేస్తా: శేజల్‌ 
ఎంపీ వెంకటేశ్‌ నేత బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను కాపాడాడని ఆరిజిన్‌ డెయిరీ సీఏవో బొడపాటి శేజల్‌ ఆరోపించారు. తనకు అన్యాయం జరిగిందని ఎంపీకి చెబితే న్యాయం చేస్తామని మాటిచ్చి మోసం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. కాంగ్రెస్‌ ఇలాంటి వారిని చేర్చుకొని ఎన్నికల్లో టికెట్‌ ఇస్తే ఢిల్లీలో ధర్నా చేస్తానని, ఎన్నికల్లో వెంకటేశ్‌ నేతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని హెచ్చరించారు.

whatsapp channel

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top