
సాక్షి, బీఆర్‌కే భవన్: దేశానికి స్వాతంత్ర్యం రాకముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. నీళ్ల విషయంలో కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసింది. 50ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీవి.. అవే మోసాలు, అవే అబద్ధాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చెప్పినవన్నీ అబద్దాలేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? అని ప్రశ్నించారు.
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్‌కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజా భవన్‌లో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు.. కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్‌కు అవగాహన లేదని బాధతో చెప్తున్నా. 299 టీఎంసీల పేరుతో శాశ్వత ఒప్పందం అని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేతకాక కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడే 299 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం చేశారు.
చంద్రబాబుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..
శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్-3పై ఎందుకు పోరాటం చేస్తారు?. సెక్షన్-3 విషయంలో ఉమా భారతి, గడ్కరీని కలిశారు. కేంద్రంపై పోరాటం చేసి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారు. బోర్డు తాత్కాలిక నీటి వినియోగం కోసం మాత్రమే వినియోగిస్తారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించాలని కోరుతున్నాను. రేవంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడారు.. చాలా బాధతో చెప్తున్నాను. కృష్ణా నదిని దోచుకో అని రేవంత్ రెడ్డి.. చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానాన్ని నేను బయటపెట్టిన తర్వాత సీఎం మాట మార్చారు.
నిజాం కట్టినవీ నీవేనా..
సీఎం రేవంత్‌కి ఎలాగూ తెలియదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదు అంటే బాధేస్తోంది. చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా?. 573 టీఎంసీలు చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అజ్ఞానం. 400 ఏళ్ల కింద కాకతీయ, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు కట్టిన ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే.. బీఆర్‌ఎస్ పాలనలో 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.

తుమ్మడిహట్టి నుంచి బ్యారేజీ మార్పుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని తప్పుపడుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చింది.. దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించు. ఎనిమిదేళ్లలో 160 టీఎంసీలకు కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి తేలేదు?. దీనిపై అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. మా మైక్ కట్ చేయకుండా, అసెంబ్లీ నుంచి పారిపోవద్దు. 20 నెలల పాలనలో ఇప్పుడు ఒక్క చెరువు, చెక్ డ్యామ్ కట్టించారా?. మీరు ఏమీ చేయకుండానే నీళ్లు ఎలా వచ్చాయి.. పంటలు ఎలా పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను వాడటం లేదు.. ఆరు శాతం నీళ్లను తక్కువగా వాడారు’ అని చెప్పుకొచ్చారు.