రైతు ఎజెండాతో జనంలోకి బీఆర్‌ఎస్‌ | BRS goes to masses with a farmer agenda for Loksabha Elections | Sakshi
Sakshi News home page

రైతు ఎజెండాతో జనంలోకి బీఆర్‌ఎస్‌

Apr 2 2024 4:59 AM | Updated on Apr 2 2024 4:59 AM

BRS goes to masses with a farmer agenda for Loksabha Elections - Sakshi

రైతుల సమస్యలే ప్రధాన అస్త్రం 

రైతు సంక్షేమం లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ అమలు చేసిన పథకాల ప్రస్తావన 

పంట పొలాల సందర్శనతో ఇప్పటికే ప్రజల్లోకి కేసీఆర్‌... 5న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటనకు ఏర్పాట్లు 

13న చేవెళ్ల సభతో ప్రచారం షురూ 

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచార పర్వంపై భారత్‌ రాష్ట్ర సమితి దృష్టి సారించింది. ‘రైతు ఎజెండా’తో బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతోంది. దీనిపై ముమ్మర కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గతంలో తాము రైతు సంక్షేమం లక్ష్యంగా అమలు చేసిన పథకాలను గట్టిగా ప్రస్తావించాలని భావిస్తోంది. వచ్చే రెండు నెలల పాటు రైతాంగం వరి కోతలు, ధాన్యం అమ్మకాల్లో నిమగ్నం కానుండటంతో ప్రచారంలో ఇవే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయంటూ బీఆర్‌ఎస్‌ అధినేత ఇప్పటికే సమర శంఖం పూరించారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్‌ ఈ నెల 5న కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు రూట్‌ మ్యాప్‌ తయారవుతోంది. కాళేశ్వరం జలాలు, విద్యుత్‌ కోతలు, ఎండుతున్న పంటలు, ధాన్యం కొనుగోలుపై బోనస్‌ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లక్ష్యంగా కేసీఆర్‌ పర్యటన ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.  

కాంగ్రెస్‌ హామీలపై కూడా 
రైతు ఎజెండాతో పాటు ఆసరా పింఛన్లు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, మహిళకు రూ.2,500 వంటి హామీలపై కాంగ్రెస్‌ తీరును క్షేత్ర స్థాయిలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ దిశా నిర్దేశం చేస్తోంది. అదే సమయంలో రామమందిరం అంశాన్ని బీజేపీ సానుకూలంగా మలుచుకుంటుందనే అంచనాతో తామూ రాముని భక్తులమేనని ప్రతిచోటా చెప్తున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. రామమందిరం పేరిట బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందంటూ ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలని నిర్ణయించింది. 

ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాలు 
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌.. ఎన్నికల ప్రచార సభల షెడ్యూలును ఖరారు చేసే పనిలో ఉన్నారు. ఈలోగా లోక్‌సభ నియోజకవర్గాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ కేడర్‌ను సమాయత్తం చేసేందుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థి, ముఖ్య నేతలతో సన్నాహక సమావేశాల బాధ్యతలను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావుతో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు.

ఇప్పటికే సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరయ్యారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పారీ్టకి ఏకపక్ష విజయాన్ని అందించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో క్షేత్ర స్థాయి ప్రచారానికి కేటీఆర్‌ శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు హరీశ్‌రావు మెదక్, వరంగల్, జహీరాబాద్‌ లోక్‌సభ స్థానాల సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో జరిగే పార్టీ భేటీలకు హాజరవుతున్నారు.

ఉగాది పండుగ లోగా లోక్‌సభ, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా బీఆర్‌ఎస్‌ సన్నాహక సమావేశాలు పూర్తి చేయడం లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఉగాది, రంజాన్‌ పండుగల తర్వాత బహిరంగ సభల ద్వారా కేసీఆర్‌ ప్రచార పర్వంలోకి అడుగు పెడతారు. ఈ నెల 13న చేవెళ్లలో జరిగే బహిరంగ సభ అనంతరం మరిన్ని సభల నిర్వహణకు షెడ్యూలు రూపొందిస్తున్నారు. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రెండు నుంచి మూడు సభలు నిర్వహించాలని నిర్ణయించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement