సీఎంపై వ్యక్తిగత విమర్శలేంటి? 

Botsa Satyanarayana Comments about PRC - Sakshi

సంఘాల నేతలు ఉద్యోగులను క్రమశిక్షణలో పెట్టాలి 

రాజకీయ పక్షాలకు, ఉద్యోగ సంఘాలకు తేడా లేదా? 

ఇది ఏ మాత్రం సరికాదు.. 

మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం  

సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాలు సీఎంతో చర్చించిన తర్వాతే ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటించిందని.. కానీ, ఆందోళన చేస్తున్న ఉద్యోగులు మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సరికాదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇలా అయితే రాజకీయ పక్షాలకు, ఉద్యోగ సంఘాలకు తేడా ఏముంటుందని ప్రశ్నించారు. ఒక ఛానల్‌లో కొందరు ఉద్యోగుల మాట్లాడిన భాష సరిగ్గాలేదన్నారు. వారిని ఉద్యోగ సంఘాల నాయకులు క్రమశిక్షణలో పెట్టాలన్నారు.

ఉద్యోగులు తమ న్యాయమైన హక్కులు కోరవచ్చని.. వాటిని చర్చల ద్వారా సాధించుకోవాలి కానీ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై  ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ప్రభుత్వం తమది కాదని స్పష్టంచేశారు. అయినా.. ప్రభుత్వోద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఏమిటి? ప్రభుత్వంపైన, సీఎంపైన వ్యక్తిగత విమర్శలేమిటని బొత్స ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి వారిని నాయకులు అదుపులో పెట్టాలన్నారు. సీఎం జగన్‌ ఉద్యోగుల బాగుకోసం తపన పడుతున్నారని, అయితే.. ఆర్థిక పరిస్థితివల్ల ఉద్యోగులు ఆశించినంతగా చేయలేకపోతున్నారనీ, ఉద్యోగ సంఘాల నాయకులే చెప్పారని ఆయన గుర్తుచేశారు.  

మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ 
అంతకుముందు.. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌  నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రి బొత్స ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల కార్మికులకు ఆప్కాస్‌ ద్వారా చెల్లింపులు జరుగుతున్నప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో  కొద్దిమందికి అందడంలేదని, ఆ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top