
సాక్షి, మైసూరు(కర్ణాటక): మాజీ సీఎం సిద్ధరామయ్యను ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని, ఆయన భస్మాసురుడు వంటివాడని, పెంచినవారిని అంతం చేసుకుంటూ పోతాడని, ప్రస్తుతం కాంగ్రెస్‌ని పాడు చేసే పనిలో ఉన్నాడని బీజేపి ఎమ్మెల్సీ హెచ్. విశ్వనాథ్ విమర్శించారు. మైసూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో సిద్ధరామయ్యకు సహాయం చేసిన వారి పని ముగిసినట్లేనని సీఎం ఇబ్రహీం ఉదంతాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ని పూర్తిగా ముంచడమే సిద్ధు ముందు ఉన్న సవాలు అని అన్నారు.
రిసార్టులో సిద్ధరామయ్య..
మైసూరు సమీపంలో ఉన్న ఒక రిసార్టులో సీఎల్పీ నేత సిద్ధరామయ్య మకాం వేశారు. పార్టీలో అనేక పరిణామాలు సంభవిస్తున్న తరుణంలో సన్నిహితులతో మంతనాల్లో నిమగ్నమయ్యారు. అలాగే కబిని జలాశయంలో పడవలో విహరించారు.
టోయింగ్‌తో ఇబ్బంది కలిగించం : సీఎం
బనశంకరి: వాహనదారులకు ఇబ్బందులు కలిగించకుండా వాహన టోయింగ్ వ్యవస్థను అమలు చేస్తామని సీఎం బొమ్మై తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్లతో పాటు ఇతర సీనియర్ అధికారుతో సమావేశం నిర్వహించారు. టోయింగ్ వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులతో ఎలా వ్యవహరించాలి, జరిమానా తదితర విషయాల చర్చించారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజా దృష్టితో పనిచేస్తుందని సీఎం అన్నారు. .
దురుసుగా ప్రవర్తించొద్దు:
టోయింగ్ సిబ్బంది వాహనదారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని నగర సీపీ కమల్‌పంత్ హెచ్చరించారు. ఇటీవల టోయింగ్ సిబ్బంది ప్రవర్తన పట్ల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమైందని, దీనిపై విచారణ చేస్తామన్నారు. అనాథపై దాడి చేసిన ఏఎస్‌ఐ నారాయణపై విచారణ చేసిన చర్యలు తీసుకుంటామన్నారు.