బీజేపీ రాజకీయ వ్యూహం.. మహిళకు అధ్యక్ష పదవి!.. రేసులో ముగ్గురు! | BJP May get first woman As Party president Post | Sakshi
Sakshi News home page

బీజేపీ రాజకీయ వ్యూహం.. మహిళకు అధ్యక్ష పదవి!.. రేసులో ముగ్గురు!

Jul 4 2025 9:01 AM | Updated on Jul 4 2025 11:51 AM

BJP May get first woman As Party president Post

ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అధ్యక్షుడు ఎవరు అని రాజకీయ వర్గాల్లో, పార్టీ వర్గాల్లోనూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. జేపీ నడ్డా పదవీకాలం ముగిసి రెండేళ్లయినా, ఇంకా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. అయితే, బీజేపీ వర్గాల నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం.. జూలై రెండో వారంలో బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉంది. దీంతో, కీలక పదవి ఎవరిని వరిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇక, ఈసారి అధ్యక్ష పదవిని మహిళకు ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్‌ చేస్తున్నట్టు నేషనల్‌ మీడియా(ఇండియా టుడే)లో కథనాలు వెలువడ్డాయి.

బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీ నుంచి ముగ్గురు మహిళల పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. వారిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఎంపీ పురంధేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరి గురించి చర్చించినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత.. తుది ని‍ర్ణయం తీసుకునే చాన్స్‌ ఉంది. 

నిర్మల ముందంజ..
అయితే, రేసులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేరు ప్రముఖంగా ఉన్నట్టు సమాచారం. ఆమె విస్తృత అనుభవం, నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు.. అధ్యక్ష బాధ్యతలను సీతారామన్‌కు ఇస్తే దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి, పార్టీ విస్తరించడానికి సహాయపడుతుందనే అంచనాకు పార్టీ నాయకత్వం ఆలోచన చేసినట్టు సమాచారం. త్వరలో తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిర్మల కీలక పాత్ర పోషించనున్నారు. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి, రక్షణమంత్రిగా విజయవంతంగా నిర్వర్తించారు. ఈమెకు ఆర్ఎస్ఎస్ మద్దతు సంపూర్ణంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెనే అధ్యక్షురాలు అవ్వొచ్చని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కారణాలతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. త్వరలోనే ఈ బిల్లును కూడా ఆమోదించాలని ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మలకు బాధ్యతలు ఇచ్చే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. 

 

వనతి శ్రీనివాసన్..
తమిళనాడుకు చెందిన న్యాయవాది, బీజేపీ నాయకురాలు వనతి శ్రీనివాసన్ కూడా పరిశీలనలో ఉంది. ఆమె ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో కోయంబత్తూర్ సౌత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1993లో బీజేపీలో చేరినప్పటి నుండి రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవి సహా అనేక కీలక బాధ్యతలను ఆమె నిర్వహించారు. 2020లో పార్టీ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో, ఆమె పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అధ్యక్ష బాధ్యతలకు ఆమెకు అప్పగిస్తే తమిళనాడులో వనతి మార్క్‌ కనిపించే అవకాశం ఉంది.

పురందేశ్వరి
రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేరు కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్‌ నాయకురాలైన పురంధేశ్వరి ఇప్పటికే పలు కీలక పదవుల్లో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి కొనసాగారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఆమోదం
మహిళా నాయకత్వం, ప్రతీకాత్మక, వ్యూహాత్మక ప్రయోజనాలను గుర్తించి, పార్టీ అత్యున్నత పదవికి మహిళను నియమించాలనే ఆలోచనను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆమోదించిందని పార్టీ సైతం వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీంతో, ఈసారి అధ్యక్ష బాధ్యతలను మహిళకే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement