యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్‌లో ‘ఆప్‌’

BJP likely to win 4 out of 5 states, shows ABP-CVoter survey - Sakshi

గోవా, మణిపూర్‌లో మరోసారి బీజేపీకే అధికారం

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం

‘ఏబీపీ–సి వోటర్‌’ సర్వే ఫలితాలు

న్యూఢిల్లీ:  వచ్చే ఏడాది కీలకమైన ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా రాబోయే లోక్‌సభ సాధారణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వీటిలో ఢిల్లీకి దగ్గరి దారి అని భావించే ఉత్తరప్రదేశ్‌ కూడా ఉండడం విశేషం. 2022లో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లో ఓటర్ల నాడిని తెలుసుకొనేందుకు ‘ఏబీపీ న్యూస్‌’ సంస్థ తాజాగా సి వోటర్‌తో కలిసి సర్వే నిర్వహించింది. తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై జనాభిప్రాయాన్ని సేకరించింది. ఫలితాలను రాష్ట్రాల వారీగా చూద్దాం..

ఉత్తరప్రదేశ్‌: హిందుత్వ రాజకీయాలకు కేంద్ర స్థానమైన ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకే మళ్లీ విజయావకాశాలు ఉన్నాయి.  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పట్ల 40 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఇక సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ పట్ల 27 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. అదృష్టం కలిసొస్తే ప్రధానమంత్రి పదవి దక్కించుకోవాలని ఆశ పడుతున్న బహుజన సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత, మాజీ సీఎం మాయావతికి ఆదరణ మరింత పడిపోయింది. ఆమె ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావాలని కేవలం 15 మంది కోరుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆశాకిరణం అని భావిస్తున్న ప్రియాంకాగాంధీ వాద్రా  తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని3 శాతం మందే ఆశించారు.

  రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ) నేత జయంత్‌ చౌదరి పట్ల 2 శాతం మంది మొగ్గు చూపడం విశేషం.  2017 నాటి ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి తన ఓట్లను 0.4 శాతం పెంచుకోనుంది. సమాజ్‌వాదీ పార్టీ ఓట్లు 6.6 శాతం పెరుగుతాయి. బీఎస్పీ 6.5 శాతం ఓట్లను, కాంగ్రెస్‌ 1.2 శాతం ఓట్లను కోల్పోతాయి. గత ఎన్నికల కంటే ఈదఫా  బీజేపీ  62 సీట్లను కోల్పోనుంది. సమాజ్‌వాదీ పార్టీ సీట్లు మరో 65 పెరుగుతుండగా, బీఎïస్పీ 5, కాంగ్రెస్‌ 2 స్థానాలను కోల్పోనున్నట్లు తేలింది. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 సీట్లున్నాయి. 2022 ఎన్నికల్లో బీజేపీ 259 నుంచి 276, సమాజ్‌వాదీ పార్టీ 109 నుంచి 117, బీఎస్పీ 12 నుంచి 16, కాంగ్రెస్‌ 3 నుంచి 7, ఇతరులు 6 నుంచి 10 సీట్లను దక్కించుకొనే అవకాశం ఉంది.

పంజాబ్‌: పంజాబ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అమరీందర్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌ సీఎం అయితే బాగుంటుందని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ను 19 శాతం మంది కోరుకున్నారు. సీఎం అమరీందర్‌  పట్ల 18 శాతం మందే మొగ్గు చూపారు. ఆప్‌ ఎంపీ భగవంత్‌ మన్‌కు 16 శాతం, పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు  నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు 15 శాతం మంది మద్దతు లభించింది.

గోవా: బీజేపీ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ పట్ల జనం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు 33 శాతం మంది చెప్పారు. గోవాలో అధికారం కోసం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా గట్టిగా పోరాడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి తదుపరి సీఎం కావాలని 14 శాతం మంది ఆశించారు.  

ఉత్తరాఖండ్‌: ఉత్తరాఖండ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా కాం్రగెస్‌ నేత హరీష్‌ రావత్‌ను 31 శాతం మంది ఓటర్లు కోరుకున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత పుష్కర్‌సింగ్‌ దామీకి 23 శాతం మంది మద్దతు పలికారు.  

మణిపూర్‌: మణిపూర్‌లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. బీజేపీకి 40.5 శాతం మంది, కాంగ్రెస్‌కు 34.5 శాతం మంది ఓటర్లు అండగా నిలిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top