డబుల్‌ డిజిట్‌ పక్కా: అమిత్‌ షా | BJP Leader Amit Shah Fires On CM Revanth Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

డబుల్‌ డిజిట్‌ పక్కా: అమిత్‌ షా

Published Fri, May 10 2024 5:50 AM

BJP Leader Amit Shah Fires On CM Revanth Reddy

రేవంత్‌రెడ్డీ చూస్కో.. బీజేపీ అగ్రనేత అమిత్‌ షా వ్యాఖ్య..  

దేశంలో కుటుంబ పాలనకు, భారతీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతోంది 

రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్‌ మోదీ గ్యారంటీ మధ్య ఎన్నికలు 

నర్సయ్యగౌడ్‌కు ఓటేస్తే అభివృద్ధికి వేసినట్లే.. భువనగిరి జిల్లా రాయగిరిలో ప్రచారం

సాక్షి, యాదాద్రి: ‘దేశంలో కుటుంబ పాలనకు, భార తీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికలు మోదీ, రాహుల్‌కు మధ్య జరుగుతు న్నాయి. మోదీ దేశం కోసం.. వారు కుటుంబాల సంక్షేమం కోసం పని చేస్తారు. ‘ఓట్‌ ఫర్‌ జిహాద్‌ వర్సెస్‌ ఓట్‌ ఫర్‌ డెవలప్మెంట్‌.. రాహుల్‌ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్‌ మోదీ అభివృద్ధి గ్యారంటీ’ మధ్య ఎన్ని కలు జరుగుతున్నాయి..’అని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 2019లో తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో గెలిచిందని, రేవంత్‌రెడ్డీ చూస్కో.. ఈసారి 10 కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ గెలవబోతోంది అని వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ బీజేపీని 400 స్థానాల్లో గెలిపించేందుకు మార్గం సుగ మం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి దయనీయంగా మారిందని, రాహుల్‌ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతులకు ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం అమలు కాలేదన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో భువనగిరి లోక్‌సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.  

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం 
‘నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చి​న బీఆర్‌ఎస్‌ పదేళ్లు తమ కుటుంబం బాగు కోసమే పని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. కానీ ఆ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. అబద్ధాలతో ఈ ఎన్నికలు గెలవాలని ఆ పార్టీ చూస్తోంది. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ మోదీ పదేళ్లుగా ఫుల్‌ మెజార్టీతో అధికారంలో ఉండి కూడా రిజర్వేషన్లు తొలగించలేదనే విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీయే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు 4 శాతం అందిస్తోంది. మేం ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం. తెలంగాణలో బీజేపీని కనీసం పది సీట్లలో గెలిపించండి. దేశంలోనే నంబర్‌ వ¯న్‌గా తెలంగాణను మార్చుతాం..’అని అమిత్‌ షా హామీ ఇచ్చారు.  

ఏబీసీలు మూడూ ఒక్కటే 
‘తెలంగాణలో ఏబీసీలు (ఏ అంటే అసద్, బీ అంటే బీఆర్‌ఎస్, సీ అంటే కాంగ్రెస్‌) మూడూ ఒక్కటే. మూడూ ట్రయాంగిల్‌ లాంటివి. షరియత్, ఖురాన్‌ ప్రకారం పాలన కొనసాగించాలని చూస్తున్నారు. బుజ్జగింపు రాజకీయాలుచేస్తున్న వీరు హైదరాబాద్‌లో శ్రీ రామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతివ్వలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ ట్రిపుల్‌ తలాక్‌ తీసుకురావాలనుకుంటున్నారు. రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్‌ పార్టీ 70 ఏళ్లు ఆపింది. 

కానీ మోదీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఐదేళ్లలో రామమందిరానికి భూమి పూజ చేయడంతో పాటు ఆలయ నిర్మాణం, బాల రాముని ప్రాణ ప్రతిష్టను పూర్తి చేశారు. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మోదీ అంతం చేశారు. నక్సలైట్‌ సిద్ధాంతాన్ని సమాప్తం చేశారు. 370 ఆర్టీకల్‌ రద్దుతో కశ్మీర్‌ మనదే అని తేలిపోయింది. కొత్త టెక్స్‌టైల్‌ విధానంతో 8 లక్షల మంది చేనేత కార్మీకులకు ఉపాధి లభించింది. రూ.1,500 కోట్లతో ఈ విధానం అమల్లోకి తెచ్చాం. మోదీ చేనేత పాలసీ తీసుకువచ్చారు..’అని వివరించారు. నర్సయ్యగౌడ్‌కు ఓటు వేస్తే మోదీకి, అభివృద్ధికి వేసినట్లే అని అన్నారు. ఈ సమావేశంలో నర్సయ్యగౌడ్‌తో పాటు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement