యూరోపియన్ పార్లమెంట్ డీజీ మాంగోల్డ్‌తో తెలంగాణ సీఈవో భేటీ | Telangana election officer Europe tour | Sakshi
Sakshi News home page

యూరోపియన్ పార్లమెంట్ డీజీ మాంగోల్డ్‌తో తెలంగాణ సీఈవో భేటీ

Jan 13 2026 4:59 PM | Updated on Jan 13 2026 5:15 PM

Telangana election officer Europe tour

ఎన్నికల సమయంలో తప్పుడు సమాచారం, సోషల్‌మీడియా ఆధారిత దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి.. యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్ క్రిస్టియన్ మాంగోల్డ్‌తో మంగళవారం కీలక భేటీ నిర్వహించారు.

ఈయూ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో కమ్యూనికేషన్ నిర్వహించే విధానం, ఫేక్ న్యూస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న సాంకేతిక, విధానపరమైన చర్యలను మాంగోల్ ఈ సందర్బంగా సుదర్శన్‌ రెడ్డికి వివరించారు. డిజిటల్ వేదికలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థల వివరాలు ఆయనకు తెలిపారు.

అనంతరం ఈవో సుదర్శన్‌రెడ్డి భారత ఎన్నికల విధానాన్ని సమగ్రంగా వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వలస ఓటర్లు వంటి వర్గాలకు సులభంగా ఓటు హక్కు వినియోగించేలా భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాల వివరాలు ఆయనకు తెలిపారు. ఈ వివరాలు తెలుసకున్న మాంగోల్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిర్వహిస్తున్న ఎన్నికల విధానంపై ప్రశంసలు వ్యక్తం చేసినట్లు తెలిపారు.

2025 జనవరి  నుంచి యూరోపియన్ పార్లమెంట్‌లో డైరెక్టర్ జనరల్ ఫర్ కమ్యూనికేషన్‌గా క్రిస్టియన్ మాంగోల్డ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం, డిజిటల్ యుగంలో ఎన్నికల విశ్వసనీయతను పరిరక్షించడమే లక్ష్యంగా సీఈవో నేతృత్వంలోని తెలంగాణ బృందం యూరప్ పర్యటనలో ఉన్నారు.  అందులో భాగంగా  ఈ భేటీ జరిగినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement