సాక్షి, హైదరాబాద్: చైనా మాంజాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌కు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక కోరిన కమిషన్.. ఫిబ్రవరి 26వ తేదీలోపు రిపోర్ట్ అందజేయాలని టీహెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.
కాగా, నిషేధిత చైనా మాంజా నగరవాసుల ప్రాణాల మీదకు తెస్తోంది. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. కాగా తాజాగా, సంక్రాంతి పండుగ వేళ నిషేధిత చైనా మాంజా కారణంగా మరొకరు గాయపడ్డారు. ఉప్పల్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగలడంతో ఏఎస్సై నాగరాజు గొంతు కోసుకుపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమైన ఏఎస్‌ఐని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చైనా మాంజా అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఆ మాంజాతో పతంగులు ఎగరేసినవాళ్లపైనా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


