సాక్షి, తాడేపల్లి: గ్రూప్–1, గూప్–2 మెయిన్స్ ఫలితాలు ప్రకటించకుండా ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష నిర్వహించి ఏడాది కావొస్తున్నా, దీనిపై వేసిన కేసులన్నీ క్లియర్ అయినప్పటికీ ఇంకా ఫలితాలు వెల్లడించకుండా నిరుద్యోగుల జీవితాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫలితాలు వెల్లడించవచ్చని కోర్టు ఆదేశించినా ఏపీపీఎస్సీని చంద్రబాబు తన జేబు సంస్థగా మార్చేసుకుని ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
అత్యంత కీలకమైన ఈ విభాగానికి ఇప్పటికీ శాశ్వత చైర్మన్‌ను నియమించకుండా కాలక్షేపం చేయడం నిరుద్యోగులను వంచించడమేనని దుయ్యబట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే నియామకాలు పూర్తి కావాల్సి ఉన్నా, వైఎస్ జగన్‌కి మంచి పేరొస్తుందన్న అక్కసుతో చంద్రబాబు తన వారితో కేసులు వేయించి మెయిన్స్ పరీక్షలు జరగకుండా అడ్డుకున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎ.రవిచంద్ర ఆక్షేపించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:
కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు:
గత వైయస్సార్సీపీ హయాంలోనే గ్రూప్–1లో 90 పోస్టులకు, గ్రూప్–2లో 905 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 2024 ఫిబ్రవరిలోనే ప్రిలిమ్స్ పరీక్ష కూడా నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం అదే ఏడాది మే నెలలో మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కోర్టులో కేసులు వేయించి, ఆ పరీక్షను అడ్డుకున్నారు. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాకుండా, దాదాపు ఏడాది తర్వాత, 2025 ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మరో ఏడాది పూర్తవుతున్నా, ఆ ఫలితాలు ప్రకటించకుండా, నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.

నిజానికి టీడీపీ వేయించిన కేసుల వల్లే ప్రిలిమ్స్ పరీక్ష జరిగి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ నియామకాలు జరగడం లేదు. కోర్టు ఆదేశాలను సైతం ఈ ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. అభ్యర్థులు కూడా ఇప్పటికే ఒకసారి ఏపీపీఎస్సీ చైర్మన్‌ని కలిసి ఫలితాలు వెల్లడించాలని విజ్ఞప్తి చేసినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రభుత్వం ఇకనైనా తన వైఖరి మార్చుకుని, వెంటనే గ్రూప్స్ మెయిన్స్ ఫలితాలు ప్రకటించి, నియామకాలు పూర్తి చేయాలని ఎ.రవిచంద్ర డిమాండ్ చేశారు.


