MLAs Episode: బీజేపీ హైకమాండ్‌ ఆగ్రహం.. రంగంలోకి కేంద్ర హోం శాఖ

BJP High Command Serious On TRs MLAs Episode - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కలకలం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ ఆరోపణలపై బీజేపీ హైకమాండ్‌ ఆగ్రహంగా ఉందని తెలిసింది. దీనిని తీవ్రస్థాయిలో తిప్పికొట్టాలని రాష్ట్ర నేతలకు సూచించినట్టు సమాచారం. ఈ అంశంలో టీఆర్‌ఎస్‌ నేతలు నేరుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలను టార్గెట్‌ చేస్తూ ఆరోపణలు గుప్పించడం, దిష్టిబొమ్మలను దహనం చేయడాన్ని ఉపేక్షించవద్దని స్పష్టం చేసినట్టు తెలిసింది. అవసరమైతే టీఆర్‌ఎస్‌తో తాడోపేడో తేల్చుకోవాలనే సంకేతాలను కూడా హైకమాండ్‌ ఇచ్చినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

సీబీఐ విచారణ.. కోర్టుల్లో పోరాటం.. 
టీఆర్‌ఎస్‌ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న అంశం గురువారం ఢిల్లీలో హాట్‌టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్‌ ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలోకి బీజేపీని లాగుతోందని భావించిన పార్టీ పెద్దలు.. దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలతో చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ అంశంలో సీబీఐ విచారణ జరిపించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, కుదరని పక్షంలో కోర్టుల ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించేలా పోరాటం చేయాలని సూచించినట్టు వివరిస్తున్నాయి.

ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ గురువారం హైకోర్టును ఆశ్రయించిందని అంటున్నాయి. ఇక రాజకీయంగానూ ఈ వ్యవహారాన్ని ఎదుర్కోవాలని నేతలకు హైకమాండ్‌ సూచించినట్టు తెలిసింది. ‘తెలంగాణలో మరో ఎనిమిది, తొమ్మిది నెలలైతే సాధారణ ఎన్నికలున్న సమయంలో ఎవరైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చేస్తారా? అదీ కేవలం నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్నంత మాత్రాన ప్రభుత్వం పడిపోతుందా? ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయా?’అన్న దానిపై విస్తృత చర్చ పెట్టాలని సూచించినట్టు సమాచారం.

ఇదే సమయంలో ‘కొనుగోళ్ల వ్యవహారం అంతా బోగస్‌. కేసీఆర్‌ ఆడుతున్న డ్రామా. పోలీసులు దీనికి సహకరిస్తున్నారు. ఫామ్‌హౌస్‌ ఎవరిది? డబ్బు ఎక్కడిది? ఎవరు ఎవరితో మాట్లాడారనే ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే పోలీసులు ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌కు ఎలా తరలించారు? బేరసారాలపై ఎమ్మెల్యేలను ప్రగతిభవన్‌లో విచారిస్తున్నారా? లేక ప్రగతిభవన్‌ చెప్పినట్టు పోలీసులు నడుచుకుంటున్నారా?’’అని బీజేపీ జాతీయ స్థాయి నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. ఈ అంశాలన్నింటినీ జనంలోకి తీసుకెళ్లాలని రాష్ట్ర పార్టీకి సూచించినట్టు వెల్లడించారు. నిజానిజాలు త్వరలోనే బయటికి వస్తాయని.. ప్రధానిని, కేంద్ర హోంమంత్రిని లక్ష్యంగా పెట్టుకొని ఇలా చేశాక పార్టీ అంత సులువుగా దీనిని వదిలిపెట్టదని పేర్కొన్నారు. 

రంగంలోకి కేంద్ర హోం శాఖ 
ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి లక్ష్యంగా విమర్శలు చేస్తుండటం, వందల కోట్ల డీల్‌ జరిగినట్టు కథనాలు వస్తుండటంపై హోంశాఖ ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి పెట్టాలని ఐబీ, ఐటీ, ఈడీలనూ అప్రమత్తం చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తమకు అందించాలని ఇప్పటికే ఏజెన్సీలను కోరినట్టు నేతలు చెబుతున్నారు. నిజంగానే కోట్ల రూపాయలు చేతులు మారితే అవి ఎవరివి? ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చేందుకు సిద్ధం కావాలని సూచించినట్టు పేర్కొంటున్నారు. కేంద్ర సంస్థలు ఈ వ్యవహారంపై రెండు మూడు రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top