మోదీ వ్యూహం ఏంటి?.. కేసీఆర్‌ తడాఖా చూపిస్తాడా?

BJP, BRS Partys taken seriously Telangana Assembly Elections - Sakshi

తెలంగాణ శాసనసభ ఎన్నికలను ప్రధాని నరేంద్ర మోడీ బాగా సీరియస్‌గా తీసుకుంటున్నట్లుగానే ఉంది. దాంతో ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా పోటీపడుతున్నారు. ప్రధాని రాకకు ఒక రోజు ముందే ఖమ్మంలో భారీ సభను నిర్వహించడం ద్వారా తన తఢాఖా చూపించాలని కెసిఆర్ భావిస్తున్నట్లుగా ఉంది. కెసిఆర్ బిఆర్ఎస్ పేరుతో  జాతీయ రాజకీయ పార్టీగా టిఆర్ఎస్‌ను మార్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో మరింత ఉత్కంఠ ఏర్పడుతుంది. దానికి తోడు మరుసటి రోజు బిజెపి సభ జరుగుతుంది. రెండు సభలను పోల్చి చూస్తారు.

ఆ క్రమంలో బిజెపికన్నా తాము చాలా బలంగా ఉన్నామని నిరూపించడం కెసిఆర్ లక్ష్యం కావచ్చు. అంతేకాక టిఆర్ఎస్ కు ఖమ్మం జిల్లా ఎప్పుడూ అంత అనుకూలంగా లేదు. దానికి తోడు బలమైన నేతగా ఉన్న మాజీ ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరబోతున్నారు. ఆయన తన వర్గాన్ని సమీకరించి ,సంఘటితం చేసే పనిలో ఉన్నారు. దానిని అడ్డుకోవడానికి కూడా బిఆర్ఎస్ ఈ సభను వాడుకుంటుంది. కెసిఆర్ పార్టీ మంత్రి అజయ్, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో సభ ఏర్పాట్లపై చర్చించినప్పుడు ఈ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియచేశారు. మరో నేత తుమ్మల నాగేశ్వరావు కూడా అంత సంతృప్తికరంగా లేరు. ఆయన కూడా పార్టీని వీడవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఆయనకు కూడా పార్టీలో ప్రాధాన్యత తగ్గడమే ఇందుకు కారణం. వీటిని అదిగమించి సభను విజయవంతం చేయడానికి ప్రయత్నాలు ఆరంభం అయ్యాయి.  

ఖమ్మం చుట్టుపక్కల జిల్లాల నుంచి, వీలైతే ఎపిలోని సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా జనాన్ని సమీకరించబోతున్నారు. మరో వైపు ఇతర పార్టీల ప్రముఖులు, కేరళ ముఖ్యమంత్రి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్, డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వంటివారిని ఆహ్వానిస్తున్నారు. ధూమ్ ధామ్ గా సభను జరపడం ద్వారా బిజెపికి చెక్ పెట్టడం, జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల, ప్రజల దృష్టిని ఆకర్షించడం కూడా ఆయన ఉద్దేశంగా ఉండవచ్చు. ఇటీవలికాలంలో కేంద్రంపై కెసిఆర్ కాని, ఆయన మంత్రులు కాని విమర్శల బాణాలు వదులుతున్నారు. ఏ అవకాశం వచ్చినా కేంద్రాన్ని తూర్పారపడుతున్నారు. తెలంగాణలో అధ్బుతంగా పురోగమిస్తుంటే, కేంద్రం అడ్డుపడుతోందన్న సంకేతం ఇవ్వడం బిఆర్ఎస్ వ్యూహంగా ఉంది. అందుకే మంత్రి హరీష్ రావు కేంద్రం నుంచి 40 వేల కోట్లు రావాలని చెబుతుంటారు.

మరో మంత్రి, పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ అయితే రోజూ ఒక లేఖ కేంద్రానికి రాస్తుంటారు. హైదరాబాద్ బాగా అభివృద్ది చెందుతోందని చెబుతూనే ప్రత్యేక ప్యాకేజీ కోరుతున్నారు. తెలంగాణలోని ఇతర మున్సిపాల్టీలకు కూడా నిదులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇలా ఆయా శాఖల పక్షాన కేంద్రానికి డిమాండ్లు పెట్టడం ద్వారా బిజెపిని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బిఆర్ఎస్ పై వచ్చే విమర్శలు అన్నిటికి బిజెపినే కారణం అని ప్రచారం చేస్తున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్దపడుతున్న బిజెపిని దోషిగా నిలబెట్టడమే వీరి లక్ష్యం. ఇక బిఆర్ఎస్‌కు సమాధానంగా భారతీయ జనతా పార్టీ కూడా అభివృద్ది మంత్రాన్ని పఠిస్తోంది. ప్రధాని మోడీ రాక సందర్భంగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ తో సహా పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

తెలంగాణలో ఏడువేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చిందని బిజెపివారు చెబుతున్నారు. కేంద్రం వేల కోట్ల రూపాయల నిధులు ఇస్తున్నా బిఆర్ఎస్ ప్రభుత్వం తన ఖాతాలోకి వేసుకుని తన వైఫల్యాలను కేంద్రంపైకి నెడుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. బిఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పి కొట్టడంలో బిజెపి నేతలు పూర్తిగా సఫలం అవడం లేదన్న అభిప్రాయం ఉంది. అందుకే ఎక్కువసార్లు పార్టీ జాతీయ నేతలుకాని,కేంద్రం ప్రముఖులు కాని రావల్సి వస్తోంది. ఆర్ఎస్ఎస్ కూడా రంగంలో దిగి బిఆర్ఎస్ కు వ్యతిరేక ప్రచారం చేయాలని నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మోడీ ఇంతవరకు తెలంగాణకు ఇటీవలికాలంలో ఐదు సార్లు వచ్చి వెళ్లారు. బిజెపి కార్యవర్గ సమావేశాలు కూడా ఇక్కడ జరిపారు. రెండోసారి సికింద్రాబాద్ లో సభ పెడుతున్నారు. ఈ విడత కెసిఆర్ పైన, బిఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు గుప్పించే అవకాశం ఉంది.

జాతీయ స్థాయిలో మోడీని ఎదిరించడానికి కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాల ప్రభావం ఇప్పటికైతే పెద్దగా లేదు. కానీ తెలంగాణలో తన పలుకుబడి తగ్గకుండా కెసిఆర్ జాగ్రత్తపడుతున్నారు. దానిని దెబ్బతీయడానికి మోడీ ఏ వ్యూహం అమలు చేస్తున్నారన్నది ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే డిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కవిత పేరును ప్రస్తావించడం జరిగింది. అయితే నిందితుల జాబితాలో పెట్టలేదు. ఎమ్మెల్యేల ఎర కేసు సిబిఐకి అప్పగించాలని హైకోర్టు ఆదేశించడం బిజెపికి ప్లస్ పాయింట్ అయితే బిఆర్ఎస్ కు నెగిటివ్ పాయింట్ అవుతుంది. ఆ కేసు విచారణ ఎన్ని మలుపులు తిరుగుతుందో చెప్పలేం.

ఎమ్మెల్యేల ఎర కేసు ద్వారా బిజెపిని బదనాం చేయడంలో కెసిఆర్ కొంతవరకు సఫలం అయినా, తాజాగా సిబిఐ టేక్ అప్ చేయడం ఆయనకు ఇరకాటమే అవుతుంది. అది రివర్స్ అవడం మొదలై, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను  తన పార్టీలో చేర్చుకున్న వైనంపై కూడా విచారణ జరిగితే తనకు కూడా తలనొప్పిగా ఉండవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. కాగా బిజెపి, బిఆర్ఎస్ ల మధ్య కాంగ్రెస్ నిలదొక్కుకోవడం కష్టంగా మారుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్ర కొంత సఫలం అయిందన్న భావన ఉన్నా, భారీ సభను పెట్టలేకపోవడం ఒక బలహీనతగా మారింది. ఏది ఏమైనా కెసిఆర్, మోడీ సభలు వెంట,వెంటనే జరుగుతుండడం బహుశా దేశం అందరి దృష్టి తెలంగాణ రాజకీయాలపై పడవచ్చు.  

- హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top