'కాంగ్రెస్ ఓటర్లను తినేందుకే బీజేపీ చీతాలను తెచ్చింది'

Bjp Brought Cheetahs To Eat Congress Votes Says Karera Mla - Sakshi

భోపాల్: బీజేపీ ప్రభుత్వం ఆఫ్రికా నుంచి భారత్‌కు చీతాలను తీసుకురావడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రగిలాల్ జాతవ్.  కాంగ్రెస్ ఓటర్లను తినేందుకే బీజేపీ వీటిని తీసుకొచ్చిందని అన్నారు.  సోమవారం  కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆఫ్రికా నుంచి భారత్ వచ్చిన చీతాలు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో ఉన్నాయి. ఈ ప్రాంతంలోని కరేరా నియోజకవర్గం నుంచే జాతవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో మాజీ సీఎం కమల్‌నాథ్ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఓ సమావేశం ఏర్పాటు చేసి జాతవ్ మాట్లాడారు.

'కుట్రలో భాగంగానే చీతాలను కునో నేషనల్ పార్కులో ఉంచారు. ఇవి ఇప్పుడు చిన్నాగానే ఉన్నాయి. కానీ పెరిగి పెద్దయ్యాక మిమల్ని తినేస్తాయి. ఫలితంగా కాంగ్రెస్ ఓటర్ల సంఖ్యను తగ్గిస్తాయి. బీజేపీ కావాలనే  పథకం ప్రకారం చీతాలను ఇక్కడకు తెచ్చింది. దీని కోసం రూ.117 కోట్లు ఖర్చుపెట్టింది.' అని జాతవ్ అన్నారు. జాదవ్ మాటలకు కాంగ్రెస్ శ్రేణులు చప్పట్లు, ఈలలతో హోరెత్తాయి. దీంతో ఆయన మొహంలో చిరునవ్వుతో వెలిగిపోయింది.

అలాగే.. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, అణగారిన వర్గాలకు చెందిన ఎంతో మంది నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారని జాతవ్ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమని, జంతువుల ప్రయోజనాల కోసమే ఆ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తోందని సెటైర్లు వేశారు.  2020లో జరిగిన ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిపై జాతవ్ 30వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా.. దేశంలో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి కేంద్రం చీతాలను తెప్పించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్‌లో వీటిని కునో నేషనల్ పార్కురు తరలించింది.
చదవండి:  కేంద్రంపై నిప్పులు చెరిగిన రాహుల్.. అదానీ వ్యవహారంపై ప్రశ్నల వర్షం..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top