అలహాబాద్‌ టు అంబేడ్కర్‌నగర్‌... యూపీలో రసవత్తర పోరు! | Sakshi
Sakshi News home page

అలహాబాద్‌ టు అంబేడ్కర్‌నగర్‌... యూపీలో రసవత్తర పోరు!

Published Wed, May 22 2024 4:09 AM

big fight On battleground Uttar Pradesh

14 లోక్‌సభ స్థానాలకు 25న పోలింగ్‌

ఉత్తరప్రదేశ్‌ సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్‌లో ఇప్పటిదాకా ఐదు విడతలకు 53 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలోకి చేరిపోయాయి. ఆరో విడతలో 14 స్థానాలకు ఈ నెల 25న పోలింగ్‌ జరగనుంది. వీటిలో 9 బీజేపీ సిట్టింగ్‌ స్థానాలు కాగా బీఎస్పీ 4, ఒకటి ఎస్పీ ఖాతాలో ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ–కాంగ్రెస్, బీజేపీ నడుమ హోరాహోరీ సాగుతోంది. బీఎస్పీ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరో విడతలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్‌... – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

అలహాబాద్‌... త్రివేణి సంగమంలో హోరాహోరీ 
ఒకప్పుడు లాల్‌ బహదూర్‌ శాస్త్రి, విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ వంటి ఉద్దండులైన ప్రధానులను దేశానికి అందించిన కాంగ్రెస్‌ కంచుకోట ఈ స్థానం. కానీ దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీ ఇక్కడ గెలుపు ముఖం చూడలేదు. చివరిగా 1984లో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కాంగ్రెస్‌ నుంచి అలహాబాద్‌లో గెలుపొందారు. తర్వాత బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్‌ జోషీ ఇక్కడ హ్యాట్రిక్‌ కొట్టారు. అనంతరం రెండుసార్లు సమాజ్‌వాదీ గెలిచినా తిరిగి కమలనాథులు పట్టుబిగించారు.

2016లో బీజేపీ గూటికి చేరిన యూపీసీసీ మాజీ చీఫ్‌ రీటా బహుగుణ జోషి గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి బీజేపీ ఆమెను పక్కనపెట్టి మాజీ గవర్నర్‌ కేసరీనాథ్‌ త్రిపాఠి కుమారుడు నీరజ్‌ త్రిపాఠికి టికెటిచ్చింది. ఇండియా కూటమి తరఫున ఎస్పీ సీనియర్‌ నేత కున్వర్‌ రియోతీ రమణ్‌ సింగ్‌ కుమారుడు ఉజ్వల్‌ రమణ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ పూర్వవైభవం కోసం ఎస్పీ దన్నుతో కాంగ్రెస్‌ తీవ్రంగా చెమటోడుస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.

సుల్తాన్‌పూర్‌... త్రిముఖ పోరు 
గోమతి నదీ తీరంలో కొలువుదీరిన ఈ నియోజకవర్గం కూడా ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటే. తర్వాత కమలనాథులు పాగా వేశారు. బీజేపీ నుంచి 2014లో వరుణ్‌ గాంధీ గెలిచారు. 2019లో వరుణ్‌ పిలిభిత్‌కు మారగా ఇక్కడ ఆయన తల్లి మేనకా గాంధీ పోటీ చేశారు. కానీ బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్‌ ఆమెను ఓడించినంత పని చేశారు. కేవలం 14,500 ఓట్లతో మేనక గట్టెక్కారు. ఈసారి కూడా బీజేపీ నుంచి మేనకే రేసులో ఉన్నారు.

ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థి రామ్‌ భువల్‌ నిషాద్‌ బరిలో ఉన్నారు. ఇక బీఎస్పీ బలమైన ఓటు బ్యాంకున్న ఉద్రజ్‌ వర్మకు టెకెటిచి్చంది. బీఎస్పీ ఇక్కడ 1999, 2004ల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. అంబేడ్కర్‌నగర్‌... 

బీఎస్పీకి ప్రతిష్టాత్మకం! 
సోషలిస్ట్‌ దిగ్గజం రామ్‌ మనోహర్‌ లోహియా జన్మస్థలమిది. 2004 దాకా అక్బర్‌పూర్‌గా ఉండేది. బీఎస్పీ కంచుకోట అయిన ఈ స్థానం నుంచి పార్టీ చీఫ్‌ మాయవతి మూడుసార్లు గెలిచారు. 2008లో పునర్విభజన తర్వాత అంబేద్కర్‌నగర్‌గా మారింది. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రితేశ్‌ పాండే గెలిచారు. ఇక్కడ దళిత, కుర్మి, బ్రాహ్మణ, ముస్లిం ఓటర్లు కీలకం. బీఎస్పీ సిట్టింగ్‌ ఎంపీ రితేశ్‌ పాండే ఈసారి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. దాంతో బీఎస్పీ కవార్‌ హయత్‌ అన్సారీకి టికెటిచ్చింది. ఎస్పీ నుంచి లాల్జీ వర్మ బరిలో ఉన్నారు.  త్రిముఖ పోరులో బీఎస్పీ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.

ప్రతాప్‌గఢ్‌... కుర్మి, బ్రాహ్మణ ఓట్లు కీలకం 
బీజేపీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ సంగమ్‌ లాల్‌ గుప్తా, ఇండియా కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థి ఎస్‌.పి.సింగ్‌ పటేల్‌ బరిలో ఉన్నారు. ఇక్కడ కురి్మ, బ్రాహ్మణ ఓట్లది కీలక పాత్ర. కుర్మి ఓటర్లు 11%, బ్రాహ్మణ ఓటర్లు 16 శాతం ఉంటారు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ (రాజా భయ్యా), సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ తివారీ కూడా ప్రభావం చూపుతారు. జనసత్తా దళ్‌ లోక్‌తాంత్రిక్‌ పేరుతో కొత్త పార్టీ పెట్టి తనతో పాటు మరో ఎమ్మెల్యేనూ గెలిపించుకున్న రాజా భయ్యా మద్దతు ఈసారి ఎవరికన్నది ఆసక్తికరం.

ఆజంగఢ్‌... ఎస్పీకి సవాల్‌ 
యూపీలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఆజంగఢ్‌ ఒకటి. ఓటర్లలో 21 శాతం యాదవులు, 17 శాతం ముస్లింలు, 19 శాతం దళితులున్నారు. భూమిహార్, ఠాకూర్, బ్రాహ్మణ, కాయస్థ ఓటర్లూ ప్రభావం చూపుతారు. 2014లో ములాయం సింగ్‌ యాదవ్, 2019లో ఆయన తనయుడు అఖిలేశ్‌ యాదవ్‌ విక్టరీ కొట్టారు. గత ఎన్నికల్లో మోదీ వేవ్‌లో సైతం ఇక్కడ కాషాయ జెండా ఎగరలేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అఖిలేశ్‌ ఈ సీటును ఖాళీ చేయడంతో వచి్చన ఉప ఎన్నికలో ప్రముఖ భోజ్‌పురీ నటుడు దినేశ్‌ లాల్‌ యాదవ్‌ నిరాహువా ఇక్కడ బీజేపీకి తొలి విజయం అందించారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి ధర్మేంద్ర యాదవ్, బీఎస్పీ నుంచి భీమ్‌ రాజ్‌భర్‌ బరిలో ఉన్నారు.

ఫూల్పూర్‌.. నెహ్రూ కోట  
ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో చరిత్రాత్మక నియోజకవర్గమిది. తొలి ప్రధాని నెహ్రూ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన స్థానం. ఇక్కడి నుంచి హ్యట్రిక్‌ కొట్టారాయన. 1962 ఎన్నికల్లో సోషలిస్టు దిగ్గజం రామ్‌ మనోహర్‌ లోహియా గట్టి పోటీ ఇచ్చినా విజయం నెహ్రూనే వరించింది. ఆయన మరణానంతరం సోదరి విజయలక్ష్మీ పండింట్‌ ఇక్కడ గెలిచారు. 1975 ఎమర్జెన్సీతో ఫూల్పూర్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 1971లో వీపీ సింగ్‌ చివరిసారిగా కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. తర్వాత ఇప్పటిదాకా ఇక్కడ హస్తానికి చాన్సే లేకుండా పోయింది! ఏళ్లుగా ఇక్కడ సమాజ్‌వాదీ పాగా వేసింది.

2004లో మాఫియా డాన్‌ అతీఖ్‌ అహ్మద్‌ సమాజ్‌వాదీ తరఫున గెలుపొందడం విశేషం. 2014లో కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తొలిసారి ఇక్కడ కాషాయ జెండాను ఎగరేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి మారడంతో వచి్చన ఉప ఎన్నికలో మళ్లీ ఎస్పీ గెలిచింది. 2019లో బీజేపీ నేత కేసరీదేవి పటేల్‌ విజయం సాధించారు. ఈసారి బీజేపీ నుంచి ప్రవీణ్‌ పటేల్, ఎస్పీ నుంచి అమర్‌నాథ్‌ మౌర్య, బీఎస్పీ నుంచి జగన్నాథ్‌ పాల్‌ బరిలో ఉన్నారు. ముగ్గురూ తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తుండటం విశేషం!

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement