హ్యాకింగ్‌ కుట్రదారులను బయటపెడతాం

Bengal Sets Up First Panel To Investigate Pegasus Scandal - Sakshi

పెగాసస్‌పై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు : బెంగాల్‌ సీఎం మమత

ఫోన్‌ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణకు ద్విసభ్య కమిటీ 

నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎం  ఆదేశం

కోల్‌కతా: దేశవ్యాప్తంగా పెగసస్‌ ఫోన్ల హ్యాకింగ్‌ ఉదంతంలో మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్‌తో బహిరంగ పోరుకు దిగిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ దిశగా మరో అడుగు ముందుకేశారు. మోదీ ప్రభుత్వం విపక్ష నేతలు, జడ్జిలను లక్ష్యంగా చేసుకునే పెగసస్‌ హ్యాకింగ్‌కు పాల్పడిందంటూ ప్రభుత్వ పాత్రను నిగ్గుతేల్చేందుకు మమత సిద్ధమయ్యారు. హ్యాకింగ్‌లో కేంద్రం కుట్రను బట్టబయలుచేసేందుకు కోల్‌కతా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావ్‌ లోకూర్‌లతో ద్వి సభ్య కమిషన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు మమత సోమవారం ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీలను ఏకంచేసే లక్ష్యంతో ఢిల్లీకి బయల్దేరేముందు మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం.

‘బెం గాల్‌లోని ప్రముఖ వ్యక్తులు, జర్నలిస్టుల ఫోన్ల హ్యాకింగ్‌కు సంబం ధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు ఉద్దేశించిన కమిషన్‌ నియామకానికి రాష్ట్ర కేబినెట్‌ ఓకే చెప్పింది. హ్యాకింగ్‌లో పాత్రధారులు ఎవరు? ఎలాంటి చట్టవ్యతిరేక మార్గాల్లో హ్యాకింగ్‌ కొనసాగింది? తదితరాలపైనా ఈ కమిషన్‌ దృష్టిసారిస్తుంది’ అని ఆమె చెప్పారు. కమిషన్‌ ఎంక్వైరీ చట్టం–1952లోని సెక్షన్‌ 3 ప్రకారం రాష్ట్రప్రభుత్వం సైతం విచారణ కమిషన్‌ను ఏర్పాటుచేయవచ్చు. ఒక రాష్ట్రం ఈ అంశంపై విచారణ కమిషన్‌కు ఆదేశించినందున మోదీ సర్కార్‌ సైతం విస్తృత స్థాయిలో విచారణ కోసం కేంద్ర కమిషన్‌ను ఏర్పాటుచేయాల్సిందేననే ఒత్తిళ్లు కేంద్రంపై పెరిగేవీలుంది.  

ఢిల్లీలో మమత 5 రోజుల టూర్‌
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీలను ఏకతాటి మీదకు తేవడమే లక్ష్యంగా మమత ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. ఇటీవల బెంగాల్‌ రాష్ట్ర ఎన్నికల్లో టీఎంసీ అధికారాన్ని కైవసం చేసుకున్నాక మమత ఢిల్లీలో పర్యటించడం ఇదే మొదటిసారి. తన పర్యటనలో భాగంగా మమత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలుస్తారు. ప్రధాని మోదీని కలుస్తానని ఢిల్లీకి బయల్దేరేముందు సోమవారం కోల్‌కతాలో విమానాశ్రయంలో విలేకరులకు మమత చెప్పారు. మోదీతో భేటీలో ఏఏ విషయాలు ప్రస్తావిస్తారో ఆమె వెల్లడించలేదు.

మోదీతో భేటీ తర్వాతే విపక్ష పార్టీలతో వరస భేటీలు ఉంటాయని సమాచారం. 30వ తేదీ వరకు ఆమె ఢిల్లీలోనే ఉంటారని, పార్లమెంట్‌కు వెళ్లి పలు పార్టీల నేతలను కలుస్తారని టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. మమత ఢిల్లీ పర్యటనపై పశ్చిమబెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌ పెదవివిరిచారు. బెంగాల్‌లో నకిలీ కరోనా టీకాల కుంభకోణం, రాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత చెలరేగిన హింస, ఇతర సమస్యలను ఎదుర్కోలేకే ఆమె ఢిల్లీకి వెళ్లిపోయారని దిలీప్‌ ఘోష్‌ ఎద్దేవాచేశారు. అప్పుల్లో కూరుకుపోయిన బెంగాల్‌ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరేందుకే మోదీని మమత కలుస్తున్నారని ఘోష్‌ ఆరోపించారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top