‘చేనేతపై జీఎస్టీ కోరింది కేటీఆరే.. దీనికేం చెప్తరు ట్విట్టర్‌ టిల్లు?’

Bandi Sanjay Hit Out KCR Over GST On Handloom - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలంటూ ప్రధానికి మంత్రి కేటీఆర్‌ పోస్ట్‌ కార్డు రాయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. చేనేత వ్రస్తాలపై 5 శాతం జీఎస్టీ విధించాలంటూ కేంద్రాన్ని కోరింది కేటీఆరేనని పేర్కొన్నారు. ఈ విషయమై కేటీఆర్‌ మాట్లాడిన వీడియో క్లిప్పింగులు కూడా ఉన్నాయన్నారు. ‘జీఎస్టీ సమావేశాల్లో పాల్గొన్నప్పుడు చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలని ఎందుకు కోరలేదు? ట్విట్టర్‌ టిల్లు దీనికేం సమాధానం చెబుతారు?’ అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు.

చౌటుప్పల్‌లో మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ మేరకు ప్రశ్నించారు. చేనేతపై జీఎస్టీ అంశానికి సంబంధించి మంత్రి కేటీఆర్, ఇతర నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు మొదటి జీఎస్టీ సమావేశంలో పాల్గొనలేదా? అని ప్రశ్నించారు. ట్విట్టర్‌ టిల్లు మునుగోడు ఓట్ల కోసం ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని, అప్పటి జీఎస్టీ సమావేశంలో తాగి పాల్గొన్నారా? అని ఎద్దేవా చేశారు.  

హామీలు నెరవేర్చకుండా అబద్ధాలు 
చేనేత వ్రస్తాలకు అద్దే రంగులపై 50 శాతం సబ్సిడీ ఇస్తామన్న రాష్ట్ర సర్కార్‌.. ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో చెప్పాలని బండి డిమాండ్‌ చేశారు.గత ఎన్నికల్లో మునుగోడు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తుండటం సిగ్గుచేటన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్‌ కుటుంబానికి అహంకారం తలకెక్కే ప్రమాదముందని, దీనిపై ఆలోచించాలని ప్రజలకు సూచించారు. కమలం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి: డీఏవీ స్కూల్‌ మరో డొల్లతనం.. 5వ తరగతి వరకే గుర్తింపు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top