విశాఖలో పరిపాలన రాజధానిపై టీడీపీ వైఖరేంటి?

Avanthi Srinivas Comments On TDP - Sakshi

మంత్రి ముత్తంశెట్టి సూటి ప్రశ్న

మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖలో పరిపాలన రాజధానికి టీడీపీ ఉత్తరాంధ్ర నాయకులు అనుకూలమా, వ్యతిరేకమా అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట డ్రామాలాడే బదులు విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకోవద్దని హితవు పలికారు. విశాఖే రాజధాని కావాలని తీర్మానం చేసి చంద్రబాబుకు పంపాలని, వారికి దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబును ఒప్పించాలని సూచించారు.

వారికి ఉత్తరాంధ్ర ఓట్లు, సీట్లు కావాలి తప్ప.. అభివృద్ధి చెందితే ఓర్చుకోలేరని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతాన్నే మూడు రాజధానులపై చంద్రబాబు అనుసరిస్తున్నారన్నారు. గంగవరం పోర్టు  90 శాతం ప్రైవేటుగా ఉందని, 10 శాతమే ప్రభుత్వానికి ఈక్విటీ ఉందని గుర్తు చేశారు. ఆ వాటాకు గత ఐదేళ్లలో ప్రభుత్వానికి రూ.80 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందన్నారు. చంద్రబాబు హయాంలో 58 సంస్థలను అమ్మేశారని.. వారు చేస్తే ఒప్పు, వేరేవాళ్లు చేస్తే తప్పా అని మంత్రి ప్రశ్నించారు. 

అభివృద్ధిపై చర్చకు సిద్ధం 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సర్కార్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు తామెప్పుడూ సిద్ధమేనని మంత్రి ముత్తంశెట్టి చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటినుంచి 13 జిల్లాలను అభివృద్ధి చేస్తున్నారని, ఏ ప్రాంతాన్ని విస్మరించలేదని గుర్తు చేశారు. తెలుగుదేశం నాయకులే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.  వైఎస్‌ జగన్‌ అధికారం చేపట్టిన తర్వాత ఉద్దానం కిడ్నీ బాధితులకు సహాయం చేయడమే కాకుండా వారి కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి నిర్మిస్తున్నారని, పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ నిర్మాణం జరుగుతోందని, పోలవరం ప్రాజెక్ట్‌ పనులు శరవేగంగా  జరుగుతున్నాయని వివరించారు.

టీడీపీ నాయకులు దుష్ప్రచారాన్ని నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని ప్రధానికి సీఎం లేఖ రాశారని, అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపారని, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల నాయకులను కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖల మంత్రుల వద్దకు తీసుకు వెళ్లారని,  ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన ఆందోళనలో తమ ఎంపీలు పాల్గొన్నారని గుర్తు చేశారు.   సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మత్స్యశాఖ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలా గురువులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top