రేవంత్‌ సభపై కోడిగుడ్లతో దాడి 

Attacked With Eggs On Revanth Reddy In Bhupalpally - Sakshi

ప్రతిగా రాళ్ల వర్షం కురిపించిన కాంగ్రెస్‌ శ్రేణులు  

దాడిలో ఓ ఎస్సైకి గాయాలు, పగిలిన థియేటర్‌ అద్దాలు 

భూపాలపల్లి/భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లిలోని అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో దాడిచేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాడిపై ఆగ్రహించిన కాంగ్రెస్‌ శ్రేణులు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలున్న ఓ థియేటర్‌పై రాళ్ల వర్షం కురిపించాయి. పావుగంటపాటు రాళ్ల దాడి కొనసాగింది.

దాడిలో కాటారం ఎస్సై శ్రీనివాస్‌ తలకు గాయమైంది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. రేవంత్‌కు స్వాగతం పలుకుతూ అంబేడ్కర్‌ చౌరస్తాలో స్థానిక కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ కటౌట్‌కు ఎదురుగా కటౌట్‌ ఏర్పాటు చేయడంపై మంగళవారం ఉదయం తలెత్తిన వివాదం చివరకు పోలీసుల లాఠీచార్జీకి దారితీసింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకొనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడిచేశారని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆరోపించారు.

దమ్ముంటే రా బిడ్డా: గండ్రపై రేవంత్‌ ఫైర్‌  
‘కొత్త రాష్ట్రంలో కోతుల గుంపు చేరి దోచుకుంటోంది. కాంగ్రెస్‌ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించాడు. మీ అభిమానాన్ని తాకట్టుపెట్టి పార్టీ ఫిరాయించిన సన్నాసులకు గుణపాఠం చెప్పేందుకే యాత్ర కార్యక్రమం తీసుకున్నా’అని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలోనే బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో రేవంత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘వారికి ఇదే నా హెచ్చరిక. వందమందిని తీసుకొచ్చి మా సభ మీద దాడి చేయిస్తావా? దమ్ముంటే నువ్వు రా బిడ్డా.. ఎవరినో పంపించి వేషాలు వేస్తున్నావా?. నేను అనుకుంటే నీ థియేటర్‌ కాదు.. నీ ఇల్లు కూడా ఉండదు. అంబేడ్కర్‌ చౌరస్తాకు రా.. నిన్ను పరిగెత్తించకపోతే ఇక్కడే గుండు కొట్టించుకొని పోతా’అంటూ రేవంత్‌ మండిపడ్డారు. ‘23న మా సభతో పాటు బీఆర్‌ఎస్‌ సభ కూడా ఉంది. రెండు పార్టీలు ఒకే రోజు సభ పెట్టకూడదనే విజ్ఞతతో ఆ రోజు సభ వాయిదా వేసుకున్నామని రేవంత్‌ అన్నారు.  
చదవండి: నవీన్‌ హత్య కేసు.. సంచలన విషయాలు బయటపెట్టిన హసన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top