చిల్లూపార్‌పైనే అందరి దృష్టి.. 37 ఏళ్లుగా వారిదే ఆధిపత్యం!

UP Assembly Election 2022: Triangle Competetion In Chillupar - Sakshi

తీవ్ర త్రిముఖ పోటీ 

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాకు చెందిన చిల్లూపార్‌ విధానసభ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 37 ఏళ్లుగా బ్రాహ్మణ వర్గం చేతి నుంచి బయటికి వెళ్లని ఈ స్థానం నుంచి ఇప్పటివరకు కమలదళం విజయం సాధించలేదు. దీంతో చిల్లూపార్‌లో కాషాయ జెండా ఎగరవేయాలని సీఎం యోగి తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోరఖ్‌పూర్‌ జిల్లాలోని కీలకమైన ఈ నియోజకర్గంలో సీనియర్‌ నేత హరిశంకర్‌ తివారీ హవా కొనసాగుతుండడం, బ్రాహ్మణుల ఓట్లు చీలడంతో ఫలితం ఆసక్తికరంగా మారనుంది. 

ఆధిపత్యం కొనసాగేనా..? 
చిల్లూపార్‌ అసెంబ్లీ స్థానానికి ఆసక్తికరమైన చరిత్ర ఉంది. 1985 నుంచి 2007 వరకు వరసగా 22 ఏళ్లు హరిశంకర్‌ తివారీ ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రాజేష్‌ త్రిపాఠి చేతిలో హరిశంకర్‌ ఓడిపోయారు. ఆ తర్వాత హరిశంకర్‌ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు వినయ్‌ శంకర్‌ సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై బరిలో దిగారు.

2017లో తొలిసారిగా చిల్లూపార్‌ నుంచి బీఎస్పీ టికెట్‌పై వినయ్‌ శంకర్‌ తివారీ పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఎస్‌పీ తరఫున వినయ్‌ శంకర్‌ తివారీ, మాజీ ఎమ్మెల్యే రాజేశ్‌ త్రిపాఠి బీజేపీ తరపున, బీఎస్పీ నుంచి రాజేంద్ర సింగ్‌ పెహల్వాన్, కాంగ్రెస్‌ అభ్యర్థినిగా సోనియా శుక్లా బరిలో దిగారు. చిల్లూపార్‌ అసెంబ్లీ స్థానంలోని 4.31 లక్షల మంది ఓటర్లలో బ్రాహ్మణులు 1.05 లక్షలు. దళిత, నిషాద్‌ ఓటర్లు కూడా నిర్ణయాత్మక స్థానంలో ఉన్నారు. దీంతో బ్రాహ్మణ, దళిత, యాదవ ప్రాబల్యం ఉన్న ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top