తగ్గేదేలే.. అస్సాంలో హైటెన్షన్‌.. రాహుల్‌ గాంధీపై కేసు నమోదు

Assam Cops Filed Case Against Rahul Gandhi For Violence During Yatra - Sakshi

గువాహటి: అస్సాం(అసోం)లో సాగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర జాతీయ రాజకీయాల్ని వేడెక్కిస్తోంది. తాజాగా.. కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ, ఇతర కాంగ్రెస్‌ నేతలపై అసోంలో పోలీస్‌ కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్వయంగా వెల్లడించారు. యాత్ర పేరుతో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారాయన. 

మంగళవారం తెల్లవారుజామున మేఘాలయా నుంచి తిరిగి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు  కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే.. అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు అయ్యిందని సీఎం హిమంత బిస్వా శర్మ తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారాయన. 

‘‘కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు హింసాత్మక చర్యలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై దాడి చేయడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర వ్యక్తులపై PDPP చట్టంలోని సెక్షన్ 120(B)143/147/188/283/353/332/333/427 IPC R/W సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది’’ అని ఎక్స్‌ ఖాతాలో సీఎం శర్మ పేర్కొన్నారు. 

బారికేడ్లను బద్దలు కొట్టేందుకు "జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు" రాహుల్‌పై కేసు నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ముఖ్యమంత్రి ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ కేసు నమోదైంది. 'జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు మీ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని నేను డీజీపీని ఆదేశించాను' అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ట్విట్టర్ పోస్ట్‌కు సీఎం హిమంత శర్మ స్పందించడం గమనార్హం. 

మరోవైపు రాహుల్ గాంధీపై రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేస్తారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్టు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం ప్రకటించారు. ఖానాపరా ప్రాంతంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఘటన తరువాత.. రాహుల్ గాంధీ సుమారు 3000 మంది వ్యక్తులు, 200 వాహనాలతో గువాహటిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు.

అడ్డుకుంటేనే మంచిది: రాహుల్‌
తాను కేసులకు భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ  పేర్కొన్నారు. అసోంలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కు ఆటంకాలు ఏర్పడుతోన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తమకు పబ్లిసిటీ కల్పిస్తున్నందున.. యాత్రకు బీజేపీ ఇంకా ఇంకా అడ్డంకులు సృష్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయ యాత్రను గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతోపాటు రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత బిశ్వ శర్మ పోలీసులను ఆదేశించిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘గతంలో కన్యాకుమారి నుంచి యాత్ర మొదలుపెట్టిన సమయంలో.. ప్రజలపై దాని ప్రభావం లేదని భాజపా నేతలు వాదించారు. కానీ, జమ్మూ-కశ్మీర్‌ చేరేనాటికి పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఇప్పుడు మొదట్లోనే అడ్డుకోవాలనేది వారి ఆలోచన. కానీ, ఇలా చేయడం ద్వారా మాకే మేలు కలుగుతుంది. కాబట్టి.. యాత్రకు ఆటంకం కలిగించాలని నేనూ కోరుకుంటున్నా. తద్వారా దేశమంతా గమనిస్తుంది. అసోం సీఎం, కేంద్ర హోంమంత్రి చేస్తున్న పనుల వల్ల కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రంలో ‘జోడో యాత్ర’ ప్రధాన అంశంగా మారింది. ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాహుల్‌కు షాక్‌.. ఆలయంలోకి అనుమతి నిరాకరణ.. కారణం ఏంటంటే.. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top