ఆప్‌ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్‌ | Sakshi
Sakshi News home page

ఆప్‌ను అంతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది: సీఎం కేజ్రీవాల్‌

Published Sun, May 19 2024 2:19 PM

Arvind Kejriwal Claims BJP Trying To Finish AAP

ఢిల్లీ: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడికి ప్రయత్నం చేసిన ఆప్‌ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆప్‌ విఫల యత్నం చేసింది. బీజేపీ కార్యాలయం వైపు వెళ్లకుండా సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఇతర నేతలను ఆప్‌ కార్యాలయం వద్దనే పోలీసులు నిలువరించారు. 

దీంతో ఆప్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో నేతలంతా ఆప్‌ కార్యాలయం వద్దే బైఠాయించారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడారు. 

‘‘ఆప్‌ను అంతం చేయాలని బీజేపీ ఆపరేషన్‌ ఝాడు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ప్రధాని మోదీ ఆమ్‌ ఆద్మీ పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారు. ఆప్‌ నేతల అరెస్టుకు ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపచేయాలని చూస్తున్నారు.

నాకు బెయిల్ వచ్చిన దగ్గరి నుంచి మోదీ.. ఆప్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆప్‌ దేశానికి మంచి పనులు చేస్తోంది. ఆప్‌ మంచి పనులపై దేశం మొత్తం చర్చించుకుటుంది.  అయితే  ఆప్‌కి బీజేపీ నుంచి ముప్పు పొంచి ఉంది’’ అని  కేజ్రీవాల్‌ మోదీ, బీజేపీపై మండిపడ్డారు.

తమ పార్టీ నేతలను అరెస్ట్‌లతో బీజేపీ టార్గెట్‌ చేయడాన్ని తప్పుపట్టిన కేజ్రీవాల్‌  ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామని కావాలనుకుంటే అందరినీ ఒకేసారి అరెస్ట్‌ చేయాలని ఛాలెంజ్‌ చేసిన విషయం తెలిసిందే. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టయిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ వీడియోలో సందేశం ద్వారా పార్టీ నేతలకు నిరసన, మార్చ్‌కు పిలుపు నిచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement