మీ రాజకీయం మరణ శాసనం.. టీడీపీకి గుడ్‌బై

AP State Minorities Commission Chairman Ziauddin Letter to Chandrababu - Sakshi

టీడీపీకి గుడ్‌బై చెబుతూ చంద్రబాబుకు ఏపీ స్టేట్‌ మైనారిటీస్‌ కమిషన్‌ చైర్మన్‌ జియాఉద్దీన్‌ లేఖ

సాక్షి, అమరావతి/గుంటూరు: దివంగత లాల్‌జాన్‌బాషా సోదరుడు, ఏపీ స్టేట్‌ మైనారిటీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఎండీ జియాఉద్దీన్‌ తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే మీ రాజకీయం టీడీపీకి మరణ శాసనంగా మారిందంటూ తన రాజీనామా కారణాలు వివరిస్తూ  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు బహిరంగలేఖ రాశారు. తమ కుటుంబం అంతా పార్టీకి అంకితభావంతో పనిచేసినట్లు తెలిపారు.

‘మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయినప్పుడు మరొక రకంగా ప్రవర్తించడం మాతో సహా వ్యక్తిత్వం కలిగిన ప్రతి ఒక్కరికీ  ఇబ్బందికరంగా ఉంది. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందూ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసాన్ని వివాదం చేశారు. ఇప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టేలా మీ స్వీయ దర్శకత్వంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును పావులా వాడుకుంటూ మీ అనుకూల మీడియాతో రాష్ట్రంలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు. మతాలు, కులాలు, ప్రాంతాల మధ్య విభజన చేసే మీ రాజకీయం టీడీపీకి మరణ శాసనంగా మారింది.

మీరు మాత్రం మారలేదు. రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు రఘురామను సీఐడీ అధికారులు అరెస్టు చేస్తే దీన్ని నిరసిస్తూ మీరు రాస్తున్న ఉత్తరాలు, పడుతున్న తపన చూస్తుంటే అధికారం కోసం ఎంతకైనా తెగించే మీ మనస్తత్వం అందరికీ అర్థమవుతోంది. ఆయన తరఫున ఢిల్లీలోను లాబీయింగ్‌ ఎందుకు నడుపుతున్నారో మీకే తెలియాలి. ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మీ నాయకత్వంలో పనిచేయడం ఇక ఆత్మహత్యా సదృశమే అవుతుంది. ఇక ఈ జన్మలో మీరు మారరనేది స్పష్టమైపోయింది. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లే పునాదిగా సాగే మీ పార్టీలో ఇంకా కొనసాగడానికి నా మనస్సాక్షి అంగీకరించడంలేదు. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని జియాఉద్దీన్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top