బీజేపీ నేత రామాంజనేయులుపై సస్పెన్షన్‌ వేటు

AP BJP suspends party leader Ramanjaneyulu - Sakshi

సాక్షి, విజయవాడ: మద్యం అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్‌ అంజిబాబుపై ఆ పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామాంజనేయుల్ని బీజేపీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నేతలు అక్రమ కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని, రామాంజనేయులు వ్యవహరంలో పార్టీ క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో తదుపరి చర్యలు కొనసాగుతాయని ఆ పార్టీ పేర్కొంది.

కాగా 2019 ఎన్నికల్లో రామాంజనేయులు మచిలీపట్నం ఎంపీ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆయన దొరికిపోయారు. గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో రామాంజనేయులు రూ.6 లక్షల విలువైన మద్యం బాటిల్స్‌తో పట్టుబడ్డారు. ఆయనతో పాటు సురేశ్, నరేశ్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. (మద్యం అక్రమ రవాణా: బీజేపీ నేత అరెస్ట్‌)

ఇక ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సస్పెన్షన్‌ వేటుకు గురవుతున్న విషయం తెలిసిందే. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్‌ ఓవీ రమణను ఇదివరకే బీజేపీ సస్పెండ్‌ చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top