
– నిర్మాత రామాంజనేయులు జవ్వాజి
విజయ్ ఆంటోనీ హీరోగా ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన తమిళ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘శక్తి తిరుమగన్’. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీల సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ పతాకంపై రామాంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుంది.
తెలుగులో ‘భద్రకాళి’ టైటిల్‌తో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామాంజనేయులు జవ్వాజి మాట్లాడుతూ– ‘‘మార్గన్’కు ముందు 11 సినిమాలకు నిర్మాతగా చేశాను. సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ‘భద్రకాళి’. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం మొదలైన రెండు నిమిషాల్లోనే ప్రేక్షకులు విజయ్‌గారి పాత్రకు కనెక్ట్ అవుతారు.
ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆలోచింపజేసే అంశాలు కూడా ఉన్నాయి. అరుణ్ ప్రభు మంచి కథ రాశారు. తమిళంలో మాత్రమే ‘శక్తి తిరుమగన్’ టైటిల్ ఉంది. మిగతా అన్ని భాషల్లో (తెలుగు, కన్నడ, హిందీ) ‘భద్రకాళి’ టైటిల్‌తోనే రిలీజ్ చేస్తున్నాం. మా ‘మార్గన్’ను రిలీజ్ చేసిన ఏషియన్ సునీల్, సురేష్, రానాగార్లే ‘భద్రకాళి’ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుత అజయ్ ధీషన్‌తో ‘బూకి’, మలయా ళంలో ఓ సినిమా చేస్తున్నాం. ‘బిచ్చగాడు’ కాంబినేషన్ విజయ్ ఆంటోనీ, శశిగార్లు తమిళంలో ‘నూరు సామి’ సినిమా చేస్తున్నారు. తెలుగులో ‘వంద దేవుళ్ళు’ టైటిల్ అనుకుంటున్నాం. మా బ్యానర్‌లో సత్యదేవ్‌తో ‘ఫుల్ బాటిల్’ సినిమా చేస్తున్నాం’’ అని అన్నారు.