త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘ఈషా’. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.
చివరి సినిమా ఆడలేదు
ఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా నా గత చిత్రం ‘ఫాదర్.. చిట్టి.. ఉమా.. కార్తీక్’ను మంచి కంటెంట్‌తో తీసినా ఎందుకో ప్రేక్షకాదరణ దక్కలేదు. దీంతో ప్రేక్షకులకు ఎలాంటి కథలు నచ్చుతున్నాయనే ఆలోచనలో పడ్డాను. అందుకే గ్యాప్ తీసుకున్నాను. ‘ఈషా’ కథను శ్రీనివాస్ మన్నె చెప్పగా ఆసక్తిగా అనిపించి ఈ చిత్రం చేశాం.
దేవుడుంటే దెయ్యం కూడా..
దేవుడు ఉన్నాడని నమ్మితే, దెయ్యం కూడా ఉందని నమ్ముతారు. నేనేతై అన్నీ నమ్ముతాను. మూఢ నమ్మకానికి, నమ్మకానికి మధ్య ఉన్న క్లాష్ ‘ఈషా’ సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో రియాలిటీ ఎక్కువగా ఉంటుంది. కష్టపడేతత్వం, ప్యాషన్, ఓర్పు... ఇవన్నీ శ్రీనివాస్‌లో చూశాను. ఈ సినిమా చూశా.. చాలా బాగుంది. థ్రిల్లర్ సినిమాలో విజువల్, సౌండ్ చాలా ముఖ్యం.
సక్సెస్ రావట్లే
ఈ చిత్రంలో ఈ రెండూ బాగుంటాయి. ఇక కోవిడ్ తర్వాత సినిమా వ్యాపారం పూర్తిగా మారిపోయింది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు నిర్మిస్తే కానీ సక్సెస్ రావడం లేదు. మా సంస్థలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందుకనే బ్యాక్ టు బ్యాక్ కాకుండా క్వాలిటీ సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అని దామోదర ప్రసాద్ (KL Damodar Prasad) అన్నారు.


