ఎల్లో మీడియా విష ప్రచారం నమ్మొద్దు | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా విష ప్రచారం నమ్మొద్దు

Published Sat, Dec 5 2020 2:54 AM

AP Assembly Session 2020: CM Jagan Fires On Yellow Media Fake News On Pensions - Sakshi

సాక్షి, అమరావతి:  పెన్షన్లు, వైఎస్సార్‌ చేయూత పథకాలపై ఎల్లో మీడియా పనిగట్టుకుని చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేలకు పెంచుతూ వెళ్తామని పునరుద్ఘాటించారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి నాడు జూలై 8న పెన్షన్‌ను రూ.2,500కు పెంచుతున్నామని స్పష్టం చేశారు. అమూల్‌పై శుక్రవారం శాసనసభలో చర్చ చేపడుతున్నట్టు స్పీకర్‌ తమ్మినేని ప్రకటించాక, ఈ అంశం చర్చకు రాకుండా విపక్షం అడ్డుకుంది. ఉపాధి హామీపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టడమే కాకుండా, సభాపతి సీటు వద్దకు వెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేశారు. అనంతరం ఈ విషయంపై సీఎం మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

దుర్బుద్ధితోనే అల్లరి
► రైతులకు ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు అమూల్‌ ద్వారా ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుందో శాసనసభ చర్చ ద్వారా చెప్పాలనుకున్నాం. 
► కుళ్లు, కుట్ర రాజకీయాలు తెలిసిన చంద్రబాబు అమూల్‌పై చర్చ రాకుండా, కావాలని తన ఎమ్మెల్యేలను పోడియం దగ్గరకే కాదు, ఏకంగా స్పీకర్‌ సీటు వద్దకే పంపాడు. ఉద్దేశపూర్వకంగా సస్పెండ్‌ వరకూ తీసుకెళ్లాడు. 

ప్రజలకు వాస్తవాలు తెలియాలి
► చంద్రబాబును వెనకేసుకొచ్చేందుకు ఎల్లో మీడియా చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటు. పెన్షన్లు, వైఎస్సార్‌ చేయూతపై అన్ని ఆధారాలతో శాసనసభలో ప్రభుత్వం వివరిస్తే ఈనాడు పత్రిక దాన్ని వక్రీకరించింది. 
► ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా ఒక పార్టీకి అమ్ముడు పోయి, వాస్తవాలను ఎలా వక్రీకరిస్తున్నాయనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. పెన్షన్లపై చంద్రబాబు హయాంలో జరిగిందేంటో తెలుసా?
► 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. అదే సంవత్సరం జనవరి (నాలుగు నెలల ముందు) పెన్షన్‌ను రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంచుతూ జీవో ఇచ్చారు. ఫిబ్రవరి నుంచి అమలు చేశారు. 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా, రెండు నెలల్లో ఎన్నికలకు వెళ్తున్నామని తెలిసి, పెన్షన్‌ను పెంచడం అంటే అది మోసం, అబద్ధం, అన్యాయం కాదా? ఇది ఎల్లో మీడియాకు కన్పించదా?
► చంద్రబాబు ఎన్నికలకు ఆరు నెలల ముందు (2018 అక్టోబర్‌) వరకు ఇస్తున్న పెన్షన్లు 45.98 లక్షలు. ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని భావించి (జనవరి నుంచి మే వరకూ) ఆ పెన్షన్లను 51 లక్షలకు పెంచారు. అంటే అర్హత ఉన్న దాదాపు 5 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. ఇది అన్యాయం, మోసం కాదా? ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కు కన్పించదా?
► ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా ప్రస్తుతం మనం 59,54,000 పెన్షన్లు ఇస్తున్నాం. చంద్రబాబు హయాంలో పెన్షన్లకు నెలకు రూ.550 కోట్లు కూడా లేదు. ఇవాళ మనం నెలకు రూ.1,500 కోట్లు ఇస్తున్నాం. ఈ వాస్తవాలు కనిపించవా?

పచ్చ మీడియా గోబెల్స్‌ ప్రచారం
► వైఎస్సార్‌ చేయూత విషయంలోనూ ఈనాడు తప్పుడు రాతలు రాయడం దారుణం. ఆ రోజు నేను చెప్పిందిదీ.. 
► ‘ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కలు అనారోగ్యంతో వారం రోజులు పనులకు పోలేకపోతే, పస్తులుండే పరిస్థితి ఉంది. వాళ్లకు 45 ఏళ్లకే పెన్షన్లు ఇవ్వాలని గతంలో నేను చెప్పాను. కానీ దాన్ని వెటకారం చేశారు. ఆ సూచనను కూడా పరిగణనలోనికి తీసుకున్నాం. 
► వైఎస్సార్‌ చేయూత అనే కొత్త పథకానికి నాంది పలికాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా దీన్ని అమలు చేస్తాం. 45 ఏళ్లు దాటిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కల కుటుంబాలకు రూ.75 వేలు ఉచితంగా ఇస్తాం. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి పూర్తి పారదర్శకతతో, ఎలాంటి లంచాలకు తావులేకుండా అందేట్టు చేస్తాం. 
► మొదటి ఏడాది ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ సచివాలయాలు పెడతాం. రెండో ఏడాది పూర్తిగా లబ్ధిదారులను ఎంపిక చేసి, నాలుగు దశల్లో రూ.75 వేలు వచ్చేలా చేస్తాం.’
► వాస్తవం ఇదైతే.. ఈర‡్ష్యతో, వాళ్లకు సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదని బాధ, కడుపు మంట, దుగ్దతో ఇలా బాధ్యత మరిచి తప్పుడు వార్తలు రాయడం మంచిదేనా?
► 24,55,534 మంది అక్కలకు చేయూత పథకం ద్వారా రూ.4,604 కోట్లు వాళ్ల అకౌంట్లకు పంపాం. వారి ఆర్థిక స్వావలంబన కోసం రిలయన్స్, ఐటీసీ, హిందూస్థాన్‌ లీవర్, పీ అండ్‌ జీ, అమూల్, అలానా గ్రూపు వంటి పెద్ద పెద్ద కంపెనీలను తెచ్చి, వాళ్లతో ఎంవోయూలు చేశాం.
► అక్కచెల్లెమ్మలకు వ్యాపార లావాదేవీల దిశగా అనుసంధానం చేస్తున్నాం. ఇప్పుడు 77 వేల రిటైల్‌ షాపులు గ్రామాల్లో కన్పిస్తున్నాయి. 4.69 లక్షల మందికి  ఆవులు, గేదెలు అందజేస్తున్నాం. అమూల్‌ సంస్థకు పాలు పోసే అక్కచెల్లెమ్మలే యజమానులు.  
► 2.49 లక్షల యూనిట్ల మేకలు, గొర్రెలు (యూనిట్‌ అంటే 15 గొర్రెలు, మేకలు.. ఇందులో 14 ఆడవి, ఒకటి మగది) అక్కచెల్లెమ్మలకు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఈ లబ్ధిదారుల్లో 6 లక్షల మందికిపైగా వితంతువులకు కూడా మేలు చేస్తున్నాం.  

ఒక్క మాటైనా తప్పామా?
► ఎన్నికలప్పుడు ప్రతీ మీటింగ్‌లోనూ అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పాం. పెన్షన్‌ అర్హత వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతిదీ తూచా తప్పకుండా అమలు చేస్తామన్నాం. (వీడియో ప్రదర్శించారు)
► అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.2 వేల నుంచి 2,250 చేశాం. వచ్చే జూలై 8వ తేదీన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రూ.2,500కు పెంచుతాం. 2022 జూలై 8న మళ్లీ రూ.2,750 చేస్తాం. ఆ తర్వాత 2023 జూలై 8న రూ.3 వేలకు తీసుకెళ్తాం. ఇచ్చిన మాటకు కట్టుబడే మనస్తత్వం మాది.  

Advertisement
Advertisement