పిన్నెల్లి ఎపిసోడ్‌.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు | Sakshi
Sakshi News home page

మూడు కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు

Published Wed, May 29 2024 4:20 AM

Anticipatory bail for YSRCP Leader Pinnelli Ramakrishna Reddy in three cases

ఫలించని పచ్చ బ్యాచ్, పోలీసుల కుట్రలు

రికార్డులు తారుమారు చేసి శక్తివంచన లేకుండా పనిచేసిన పోలీసులు

వీరి కుట్రలను పటాపంచలు చేసిన న్యాయస్థానం

అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలొద్దని పోలీసులకు ఆదేశం.. కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకే ఈ మధ్యంతర బెయిల్‌

ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప 

పలు షరతులు విధించిన కోర్టు

పిన్నెల్లి తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు ఓ షరతులో సవరణ

సాక్షి, అమరావతి: పచ్చ బ్యాచ్, పోలీసులకు హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. ఓట్ల కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు వారు పన్నిన కుట్రలను పటాపంచలు చేసింది. రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ రాకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ, పోలీసులు కుమ్మక్కయినా కూడా ప్రయోజనం లేకపోయింది. రికార్డులను తారుమారు చేసి, బాధితులను ముందు పెట్టి పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ను అడ్డుకు­నేందుకు పన్నిన కుట్రలు విఫలమయ్యాయి. రామకృష్ణారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో హైకోర్టు ఆయనకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

అరెస్ట్‌తో సహా పిన్నెల్లిపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఈ నెల 6వ తేదీ వరకు ఈ బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. జేసీ అస్మిత్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, చింతమనేని ప్రభాకర్, పరిమి సోమశేఖర్‌ నాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన తరహాలోనే పిన్నెల్లికి కూడా బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌కు పలు షరతులు విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

పోలీసుల చర్య చాలా తీవ్రమైనది
ఈ మూడు కేసుల్లో పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. మిగిలిన నిందితులను 16వ తేదీనే అరెస్ట్‌ చేసినప్పటికీ, వారిని 23వ తేదీన నిందితులుగా చేర్చినట్లు రిమాండ్‌ రిపోర్ట్‌లో చెప్పడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది చాలా తీవ్రమైన విషయమని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఇలా చేయడం డీకే బసు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పిన్నెల్లిని 22వ తేదీనే నిందితునిగా చేర్చారని పోలీసులు చెప్పిన విషయాన్ని, కింది కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో 23వ తేదీ రాత్రి 8 గంటలకు నిందితునిగా చేర్చినట్లు పేర్కొనడాన్ని హైకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై తుది విచారణ సమయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మరింత వివరణనివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.మధ్యంతర ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు...
ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులతో సహా మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉన్నందున మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ రామకృష్ణారెడ్డి హైకోర్టులో వేర్వేరుగా మూడు అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిన్నెల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది ఎస్‌.రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్‌ జ్యోతిర్మయి ఆ మూడు అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ షరతులు..
పిన్నెల్లిపై నిఘా ఉంచేలా పోలీసులను ఆదేశించాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి నేరపూరిత చర్యల్లో పాల్గొనకూడదని, పునరావృతం చేయరాదని పిన్నెల్లిని ఆదేశించింది. జిల్లాలో శాంతిభద్రతల సమస్య సృష్టించకూడదని చెప్పింది. ప్రజాశాంతికి, సాక్షుల రక్షణకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని, అనుచరులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకుండా చూడాలని పిన్నెల్లిని ఆదేశించింది. అనుచరుల బాధ్యత రామకృష్ణారెడ్డిదేనని స్పష్టం చేసింది. ఈ కేసు గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. సాక్షులు, బాధితులతో సంభాషించవద్దని, వారిని బెదిరించడం వంటివి చేయరాదని తెలిపింది. 

పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో మాత్రమే ఉండాలని, ఒకవేళ కౌంటింగ్‌ కేంద్రం మరో చోట ఉంటే లెక్కింపు రోజున ఆ కేంద్రానికి వెళ్లొచ్చునని తెలిపింది. ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు పల్నాడు ఎస్‌పీ ముందు హాజరు కావాలని పిన్నెల్లిని ఆదేశించింది. నర్సరావుపేటలో తాను ఎక్కడ ఉంటున్నదీ, తన మొబైల్‌ నంబరు వివరాలను పోలీసులకు తెలియచేయాలని ఆదేశించింది. స్థానిక కోర్టుల్లో పాస్‌పోర్ట్‌ జమ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడానికి వీల్లేదని ఆదేశించింది. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. 

అయితే, ఓ షరతును కొద్దిగా సవరించాలని పిన్నెల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి అభ్యర్థించారు. కౌంటింగ్‌ రోజున ఎస్‌పీ ముందు హాజరయ్యేంత సమయం ఉండదని, అందువల్ల ఆ రోజున రిటర్నింగ్‌ అధికారి ముందు హాజరవుతారని తెలిపారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి సమ్మతించి ఆ మేరకు ఆ షరతును సవరించారు. ప్రజా ప్రతినిధులు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ చర్యల విషయంలో చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తన ఉత్తర్వుల్లో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ‘న్యాయ చక్రాలు నెమ్మదిగా కదిలినప్పటికీ, అవి గొప్పగా కదులుతాయి,’ అంటూ ఓ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన కొటేషన్‌తో న్యాయమూర్తి తన ఉత్తర్వులను ముగించారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement