
సాక్షి, అమరావతి: దేశంలోనే అతిపెద్ద కుంభకోణమైన అమరావతిపై చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధపడాలని.. అందుకు సిద్ధమో కాదో 24 గంటల్లో ఆయన చెప్పాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలోని అవకతవకలు, కుంభకోణాల మీద సీబీఐ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో అర్థంకావట్లేదని.. దీనిపై అసలు బాబు నోరెందుకు మెదపడంలేదని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
► అధికారంలో ఉండగా సీబీఐను రావద్దన్న వ్యక్తి ఇప్పుడు ప్రతి దానికీ సీబీఐ విచారణను కోరుతున్నారు. అంతర్వేది ఘటనపై సీఎం వైఎస్ జగన్ సీబీఐ విచారణకు ఆదేశించినా బాబు స్పందించలేదు. అమరావతిని రాజధానిగా నిర్ణయించడమే అతిపెద్ద స్కాం. చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులు, వారి బినామీలు అక్కడ కారుచౌకగా భూములు కొన్నారు.
► ప్రభుత్వ రహస్యాలను బయట పెట్టబోమని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బాబు దానిని భగ్నం చేస్తూ వాటిని తన మనుషులకు లీక్‌చేసి వారితో భూములను కొనిపించారు. దేశంలో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడా జరగలేదు. పెద్దలుగా చెలామణి అవుతున్న వారు ఈ కుంభకోణంలో పాత్రధారులు. దీనిపై సీబీఐ విచారణ వేయాల్సిందిగా మా ఎంపీలు కేంద్రాన్ని కోరుతున్నారు.
► చంద్రబాబుకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే, మీరు, మీ అబ్బాయి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో లేరని భావిస్తే సీబీఐ విచారణను కోరాలి. లేదంటే స్కాం జరిగినట్లే కదా.
► లోకేశ్ బినామీగా ఉన్నæ వేమూరి రవికుమార్ రాజధాని ప్రకటనకు ముందే 62 ఎకరాల భూమిని కొన్నాడు.
► ఫైబర్‌గ్రిడ్ స్కాంలో లోకేశ్‌కు వాటా ఉంది.
► ప్రతిదానికి సీబీఐ ఎంక్వైరీ కావాలంటున్న చంద్రబాబు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు ఘోరాలు, అన్యాయాలపై బీజేపీ సీబీఐ విచారణకు ఆదేశించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పోలీస్ వ్యవస్థ, డీజీపీ మీద హైకోర్టు వ్యాఖ్యలు దురదృష్టకరం. న్యాయస్థానాలపట్ల మాకు గౌరవం ఉంది.
► వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టుకు వెళ్లలేం. ఆర్డర్స్ ఇస్తే దానిపై వెళ్తాం.
► రమేష్ ఆస్పత్రి వ్యవహారంపై అసలు విచారణ జరగడానికి వీల్లేదని హైకోర్టు వారు స్టే ఇస్తే దానిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే విచారణ ఆపాల్సిన అవసరంలేదని వారు చెప్పారు.
దమ్మాలపాటి వెనుక చంద్రబాబు!?
మీడియా సమావేశం అనంతరం అంబటి రాంబాబు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. అమరావతి భూ కుంభకోణం విషయంలో ఏసీబీ కేసుపై హైకోర్టుకు వెళ్లిన దమ్మాలపాటి శ్రీనివాస్‌కు.. గంటకు లక్షల్లో ఫీజు తీసుకునే ముకుల్ రోహత్గీ వంటి సీనియర్ న్యాయవాదిని నియమించుకునే స్థోమత ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈయన వెనుక ఉండి అంతా తానై నడిపిస్తున్న చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. బాబు భయపడకపోతే సీబీఐ విచారణకు ఎందుకు ముందుకు రావడంలేదని ప్రశ్నించారు.