పేలవమైన ప్రదర్శన నుంచి పదవుల దాకా.. యూపీలో మజ్లిస్‌ పార్టీ హవా!

AIMIM UP Local Body Results Really Great Threat For SP - Sakshi

తెలంగాణలో, అదీ హైదరాబాద్‌లో అధిక ప్రభావం చూపే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM).. వడివడిగా మిగతా రాష్ట్రాల్లోనూ అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బొటాబొటీ ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న పార్టీ.. తాజాగా యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన హవాపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా పదవులను చేపట్టే స్థాయికి చేరుకోగా.. మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలో టెన్షన్‌ మొదలైంది. 

ఒకే ఒక్క సీటు.. 0.49 శాతం ఓట్లు.. కిందటి ఏడాది జరిగిన ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల్లో ఎంఐఎం రాబట్టిన ఫలితం ఇది. థర్డ్‌ ఫ్రంట్‌ ‘భగీదారి పరివర్తన్‌ మోర్చా’ పేరుతో ఎన్నికల్లో దిగినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మజ్లిస్‌ పార్టీ. అయితే.. యూపీ నగర పాలికా పరిషత్‌లో ఐదుగురు మజ్లిస్‌ అభ్యర్థులు చైర్మన్లుగా, మరో 75 మంది కౌన్సిలర్లుగా ఎన్నికైనట్టు ఒవైసీ తెలిపారు. మీరట్‌లో 11 మంది కౌన్సిలర్‌ స్థానాలను దక్కిం చుకొని మజ్లిస్‌ డిప్యూటీ చైర్మన్‌ పదవిని చేపట్టబోతున్నారు. మీరట్‌లో అయితే ఏకంగా మేయర్‌ అభ్యర్థిత్వానికి జరిగిన పోటీలో బీజేపీ నామిని తర్వాత రెండో స్థానంలో నిలిచారు ఎంఐఎం అభ్యర్థి. 

అయితే.. ఈ మొత్తంలో నష్టపోయింది ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీనే!. ముస్లిం ఓటు బ్యాంకును ఇంతకాలం మెయింటెన్‌ చేస్తూ వస్తున్న ఎస్పీకి ఇది ఊహించిన షాక్‌ అనే చెప్పాలి. అదీగాక.. ఇంతకాలం బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలకే పరిమితమైన స్థానిక సంస్థల్లో మజ్లిస్‌ పాగా వేయడం ఓ మైలురాయిగా చెప్పొచ్చు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లిం ఓట్‌ బ్యాంకు అంతా దాదాపుగా సమాజ్‌వాదీ పార్టీ వైపే వెళ్లింది. మిత్రపక్షాలతో కలిసి 34 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపి.. విజయం సాధించింది ఎస్పీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది.  ఎంఐఏం చేజిక్కించున్న నగర పాలిక పరిషత్‌లలో ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండు చోట్ల చివరాఖరి స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. 

అన్నింటికి మించి.. మీరట్‌ ఫలితం మజ్లిస్‌ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. 2.35 లక్షల ఓట్లతో(41 శాతం) బీజేపీ అభ్యర్థి హిరాకాంత్‌ అహ్లువాలియా మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో 1.28 లక్షల ఓట్లతో(22.37 శాతం) ఎంఐఎం అభ్యర్థి అనస్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక.. మూడో స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అతుల్‌ ప్రధాన్‌ భార్య సీమా ప్రధాన్‌ నిలిచారు. 

17 మేయర్‌ సీట్లకుగానూ 10 చోట్ల, అలాగే.. 52 నగర పాలిక పరిషత్‌ చైర్‌పరిషత్‌ అభ్యర్థులను, 63 మంది నగర పంచాయితీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులను, 653 వార్డ్‌ మెంబర్‌.. పరిషత్‌ మెంబర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో దింపింది ఎంఐఎం. మొత్తంగా అర్బన్‌ లోకల్‌ బాడీ ఎన్నికల్లో   83 వార్డులు గెల్చుకున్నట్లు ప్రకటించుకుంది ఆ పార్టీ.  మజ్లిస్‌ పార్టీ సాధించిన ఈ ఫలితం కంటే సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం అనే కోణంలోనే చర్చ నడుస్తోంది అక్కడ. ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా.. ఎస్పీ ఓటు బ్యాంకుకు ఎంఐఎం దెబ్బ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

ఇప్పటికే యూపీ, బీహార్, మహారాష్ట్రలలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ మెంట్ అయ్యింది మజ్లిస్‌ పార్టీ. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లతో పాటు దళిత ఓట్లను సైతం ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం యూపీ థర్డ్‌ఫ్రంట్‌లోకి మాయావతి బీఎస్పీకి సైతం ఆహ్వానం పంపింది. అటు నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఎంఐఎం భావిస్తోంది కూడా.

మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీజేపీ  పసమందా ముస్లిం(వెనుకబడిన ముస్లింలు)లను ఆకర్షించేలా స్వయంగా ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. 

సార్వత్రిక ఎన్నికల్లో పది నుంచి పదిహేను స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోందట. ఈ విషయాన్ని ఎంఐఎం జనరల్‌ సెక్రటరీ పవన్‌ రావ్‌ అంబేద్కర్‌ ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top