ఒడిసిపడుదాం | - | Sakshi
Sakshi News home page

ఒడిసిపడుదాం

Nov 3 2026 12:39 AM | Updated on Nov 3 2026 12:39 AM

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం జల సంరక్షణకు పెద్దపీట ముందస్తు చర్యలకు జిల్లా యంత్రాంగం శ్రీకారం

పెద్దపల్లి: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం, రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించడం, గ్రామీణులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ రూపొందించింది. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష నేతృత్వంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, తాగునీరు, విద్యుత్‌శాఖలను సమన్వయం చేస్తూ చర్యలు చేపడుతున్నారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణరావు, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతున్నారు.

8 శాతం లోటు వర్షపాతం

జిల్లాలో జూన్‌ 1 నుంచి అక్టోబర్‌ 27 వరకు 863 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 940.9 మి.మీ.తో పోలిస్తే 8 శాతం లోటు ఏర్పడింది. జూలైలో సాధారణం కంటే 42 శాతం అధిక వర్షపాతం నమోదవగా, ఆగస్టులో 51 శాతం లోటు నమోదైంది. జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్‌, మంథని మండలాల్లో వర్షపాతం లోటు పరిస్థితుల నేపథ్యంలో రానున్న వేసవిలో నీటి కొరతను అధిగమించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు.

జల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం

తెలంగాణ జలసిరి, వీబీజీ రామ్‌జీ పథకాల కింద జిల్లాలో 1,144 ఫాంపాండ్లు, 7,890 వ్యక్తిగత ఇంకుడుగుంతలు, 230 సామూహిక సోక్‌పిట్లు, 65 బో ర్‌వెల్‌ రీఛార్జ్‌ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వర్షపు నీరు వృథా కాకుండా భూ మిలోకి ఇంకేలా చర్యలు చేపడుతున్నారు. వచ్చే వ ర్షాకాలానికి ముందే సాధ్యమైనన్ని నిర్మాణాలు పూ ర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని 263 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు విస్తరించనున్నారు. 1.18 లక్షల జాబ్‌కార్డుల పరిధిలో 2.38 లక్షల మంది కార్మికులు ఉండగా, 1.06 లక్షల మంది క్రియాశీ లకంగా ఉన్నారు. ఉపాధి పనుల ద్వారా గ్రామీణులకు కూలీ కల్పించడంతోపాటు శాశ్వత నీటి సంరక్షణ నిర్మాణాలు అభివృద్ధి చేయనున్నారు.

యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు

నీటి లభ్యత తగ్గే అవకాశాల నేపథ్యంలో యాసంగిలో వరి సాగుకు బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తోంది. గత రబీ సీజన్‌లో 2,43,601 ఎకరాల్లో పంటలు సాగవగా, ప్రస్తుత సీజన్‌కు 1,53,586 ఎకరాల సాగు విస్తీర్ణాన్ని ప్రతిపాదించారు. జొన్న, సజ్జ, రాగి, కంది, పెస ర, మినుము, నువ్వులు, వేరుశెనగ, పొద్దుతిరుగు డు వంటి పంటలను ప్రోత్సహించనున్నారు. ఉద్యా న పంటల విస్తీర్ణాన్ని గత ఏడాది 726 ఎకరాల నుంచి 1,490 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డ్రిప్‌, స్ప్రింక్లర్‌, మల్చింగ్‌ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులపైనా అవగాహన కల్పిస్తున్నారు.

వానాకాలం పంటలకు భరోసా

ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు సాగు చేసిన పంటలను కాపాడేందుకు ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల ఆధారంగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ వరి ఆయకట్టు 2,12,036 ఎకరాలు కాగా, సుమారు 60 శాతం ఆయకట్టుకు నీరు అందినట్లు అధికారులు తెలిపారు. చివరి ఆయకట్టుకు నీరు చేరేలా కాలువల క్రాస్‌ రెగ్యులేటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మరమ్మతు చేపడుతున్నారు. యాసంగికి ఎస్సారెస్పీ నుంచి సాగునీటి విడుదల సాధ్యం కాకపోవచ్చనే అంచనాతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.

తాగునీరు, విద్యుత్‌పై నిఘా

వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 17.62 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించి చేతిపంపులు, మోటార్లు, పైపులైన్లు, ఓవర్‌హెడ్‌ ట్యాంకుల పరిస్థితిని తనిఖీ చేయనున్నారు. జిల్లాలోని 373 ఆవాసాలకు 353 ఆవాసాలు సురక్షితమైనవిగా గుర్తించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి 1916 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచారు. వ్యవసాయానికి ప్రస్తుతం సగటున 12 గంటల పాటు త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ పనిచేయకపోతే అదే రోజు మార్చేలా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement