పెద్దపల్లి: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బి.శ్రీరాములుతో కలిసి ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ధర్మారం మండలం కొత్తూరుకు చెందిన జోగుల లచ్చయ్య సర్వే నంబర్ 429లోని ఏడు గుంటల భూమికి పట్టాదారు హక్కులు కల్పించాలని కోరగా, ధర్మారం తహసీల్దార్‌కు పంపించి చర్యలు తీసుకోవాలని సూచించారు. శ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన జాసోదపు లక్ష్మి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరగా, పరిశీలించి చర్యలు తీసుకోవాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. మంథని మండలం నాగారానికి చెందిన గాజుల ప్రశాంత్ తాను శారీరక వైకల్యం కలిగి ఉన్నానని, డిగ్రీ పూర్తి చేశానని, ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయగా వారధి సొసైటీకి సిఫారసు చేశారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ వెళ్లగానే అధికారులు ఖాళీ
ప్రజావాణి నుంచి కలెక్టర్ ముఖ్య పనులపై బయటకు వెళ్లడంతో అధికారులు ఖాళీ చేసి వెళ్లారు. అధికారులు లేకపోవడంతో ఖాలి కుర్చీలు కనబడగా, దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలో తెలియక బాధితులు ఇబ్బందులు పడ్డారు. చివరికి కలెక్టరేట్ ఏవో బండి ప్రకాష్ దరఖాస్తులు స్వీకరించారు. ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించాల్సిన అధికారులు ముందే వెళ్లిపోవడాన్ని ప్రజలు తప్పుపట్టారు.


