బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే ధాన్యం కొనుగోళ్లు
మార్కెట్‌లో మాత్రం పెరుగుతున్న బియ్యం ధరలు
సన్నబియ్యం ధరలు నిర్ణయించినా దుకాణాల్లో అమలుకాని ధరల నియంత్రణ ఆదేశాలు
అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతపై కొరవడిన అధికారుల నిఘా
సాక్షి, పెద్దపల్లి: రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. వినియోగదారుడికి మాత్రం బియ్యం కొనాలంటే జేబుకు చిల్లు పడుతోంది. పొలంలో పండిన ధాన్యాన్ని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు.. అదే ధాన్యంతో తయారైన బియ్యాన్ని మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. దీంతో అటు అన్నదాతలు.. ఇటు సామాన్య వినియోగదారులు నష్టపోతున్నారు. ఒకవైపు సాగు పెట్టుబడులు పెరిగి, దిగుబడులు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు సన్నబియ్యం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుల బడ్జెట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఆరు రకాల సన్నబియ్యానికి ప్రభుత్వం గరిష్ట ధరలు నిర్ణయించి, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. ధరల నియంత్రణ ఆదేశాలు కాగితాలకే పరిమితం కావడం,
నిల్వలపై పర్యవేక్షణ కొరవడడం పలు విమర్శలకు తావిస్తోంది.
పంట సాగు కోసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదని చెబుతున్నారు. పంట చేతికొచ్చిన వెంటనే పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం ధాన్యాన్ని విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యాపారులు గ్రామాలు, కల్లాల వద్దే పచ్చి వడ్లను తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. తేమ, తరుగు పేరుతో అదనపు కోతలు విధిస్తూ అందాల్సిన మొత్తాన్ని తగ్గిస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు.
బియ్యం ధరలు ౖపైపెకి..
ధాన్యం కొనుగోలు సమయంలో తక్కువ ధర చెల్లిస్తున్న వ్యాపారులు.. బియ్యం విక్రయించే సమయంలో మాత్రం అధిక ధరలు వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. జైశ్రీరాం రకం బియ్యం క్వింటాల్ ధర గతంలో రూ.7,800 ఉండగా ప్రస్తుతం రూ.9,800 చేరింది. హెచ్‌ఎంటీ రూ.6,500–రూ.8,500 పెరిగింది. ఇతర సన్నబియ్యం రకాల ధరలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. రిటైల్ మార్కెట్‌లో నాణ్యత, బ్రాండ్‌ను బట్టి కిలో సన్నబియ్యం రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. దీంతో గతంలో నెలకు ఒకేసారి 25 కిలోల బియ్యం కొనుగోలు చేసే కుటుంబాలు సైతం ప్రస్తుతం అవసరానికి సరిపడా మాత్రమే కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది.
ఆరు రకాల బియ్యానికి గరిష్ట ధరలు
సన్నబియ్యం ధరల పెరుగుదలతో సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు పౌరసరఫరాల శాఖ రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశమై ఆరు రకాల బియ్యానికి గరిష్ట చిల్లర ధరలు నిర్ణయించింది. హెచ్‌ఎంటీ, జైశ్రీరాం కిలో రూ.79, ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా కిలో రూ.74, బీపీటీ, కేఎన్‌ఎం కిలో రూ.66 నిర్ణయించగా, బియ్యం దుకాణాలు, రైస్‌మిల్లులు, హోల్‌సేల్ విక్రయ కేంద్రాల్లో వినియోగదారులకు ధరలు కనిపించేలా ప్రత్యేక బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. నిర్దేశించిన ధరలకు మించి విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆదేశాలు వెలువడి రోజులు గడుస్తున్నా వాటి అమలు మాత్రం కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి.
ఆదేశాలు ఒకవైపు.. అమ్మకాలు మరోవైపు!
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు, మార్కెట్‌లో వ్యాపారులు విక్రయిస్తున్న ధరలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. హెచ్‌ఎంటీ, జైశ్రీరాం రకాలు కిలో రూ.79 విక్రయించాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో రూ.90 నుంచి రూ.100 వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకాలకూ నిర్ణయించిన రూ.74 ధర అమలుకు నోచుకోవడం లేదని అంటున్నారు. ధరల వివరాలతో కూడిన బ్యానర్లు సైతం దుకాణాల్లో కనిపించడం లేదనే విమర్శలున్నాయి. గరిష్ట ధరలు నిర్ణయించడంతోనే బాధ్యత పూర్తికాదని, వాటిని వ్యాపారులు తప్పనిసరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పర్యవేక్షణ కమిటీలు
ఏమయ్యాయి?
బియ్యం ధరల నియంత్రణ, అక్రమ నిల్వల గుర్తింపు కోసం సంబంధిత శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసినా వాటి కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదనే విమర్శలున్నాయి. పౌరసరఫరాల, తూనికలు–కొలతలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు సమన్వయంతో తనిఖీలు చేపట్టాల్సి ఉంది. దుకాణాల్లో ధరల పట్టికలు ఏర్పాటు చేశారా? నిర్ణయించిన గరిష్ట ధరలకే విక్రయిస్తున్నారా? గోదాములు, మిల్లుల్లో ఎంత మేరకు నిల్వలు ఉన్నాయి? హోల్‌సేల్ వ్యాపారులు ఏ ధరలకు సరఫరా చేస్తున్నారు? అనే అంశాలపై నిరంతర పర్యవేక్షణ అవసరం. కేవలం సమావేశాలు, హెచ్చరికలతో ధరలు అదుపులోకి వచ్చే పరిస్థితి లేదు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ నిర్ణయాలకు సార్థకత చేకూరుతుంది.


