గోదావరిఖని: సింగరేణి మెడికల్ బోర్డులో అప్పుడు 80 శాతం ఇన్వాలిడేషన్ చేస్తే.. ఇప్పుడు దానిని 14 శాతానికి కుదిస్తూ ప్రభుత్వాన్ని కావాలనే ఎందుకు బద్నాం చేస్తున్నారని కోల్‌బెల్ట్ ప్రాంత మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు సీఎండీతోపాటు డైరెక్టర్(ఫా)ను ప్రశ్నించారు. గతనెల 28న హైదరాబాద్ ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వివేక్, సింగరేణి సీఎండీ, డైరెక్టర్(పా), కోల్‌బెల్ట్ ప్రాంత మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఐఎన్‌టీయూసీ నాయకులు, సీపీఐ ఎమ్మెల్యే పాల్గొన్నారు. సింగరేణి అనుసరిస్తున్న విధానాలపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా నెలలో రెండు మెడికల్ బోర్డులు, అత్యధికంగా ఇన్వాలిడేషన్ ఉంటుందని హామీ ఇచ్చినా ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని సీఎండీని నిలదీసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం తీరుతో ప్రభుత్వంపై కార్మికుల్లో వ్యతిరేకత వస్తోందన్నారని సమాచారం.
గనులపైకి వెళ్లని పరిస్థితి..
మెడికల్ ఇన్వాలిడేషన్ తీరుతో తాము గనులపైకి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. 14శాతాన్ని మించి మెడికల్ ఇన్వాలిడేషన్ లేదన్నారు. మెడికల్ బోర్డు నిర్ణయాలను పునఃసమీక్షించాలని సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జించిన లాభాల్లో కార్మికులకు 35 శాతం లాభాల వాటా ప్రకటించాలని, దసరాలోపు చెల్లించాలని, కార్మికుల సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలని, పెర్క్స్‌పై ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
మారుపేర్లపై వన్‌టైం సెటిల్‌మెంట్..
కార్మికుల కుటుంబాల్లో చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉన్న అలియాస్ నేమ్స్ సమస్యను మానవీయ కోణంలో పరిశీలించి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే ఈ అంశంపై కమిటీ సమావేశం జరిగిన నేపథ్యంలో తదుపరి చర్యలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
కోర్టు, విజిలెన్స్ కేసులపైనా సమీక్ష
పెండింగ్‌లో ఉన్న కోర్టు, విజిలెన్స్ కేసులను సమీక్షించి, సాధ్యమైన మేరకు మానవీయ కోణంలో పరిష్కరించాలని కోరారు. డిస్మిస్ అయిన కార్మికులకు కూడా నిబంధనల మేరకు మరో అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలన్నారు.
కొత్త గనులు.. సింగరేణి విస్తరణ
భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త బొగ్గు గనులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు కోరారు. ఉత్పత్తితోపాటు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని, ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. గనుల్లో డ్రిల్ బిట్స్, భద్రత సామగ్రి, డంపర్ల స్పేర్ పార్ట్స్ తదితర అవసరమైన పరికరాల కొరత ఉందని నాయకులు ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రుల్లో వైద్యుల కొరత తీర్చాలని సూచించారు.
భట్టి సానుకూల స్పందన
కార్మికుల సమస్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దసరాలోపు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈఅంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది కోల్‌బెల్ట్‌లో ఆసక్తికరంగా మారింది.


