రామగుండం: భారతదేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతూ రాకపోకలు సాగించే హిమసాగర్ రైలు ప్రయాణం 42 వసంతాలకు చేరింది. కన్యాకుమారి–జమ్ముతావి మధ్య(16317/16318) ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ రైలు 1984 అక్టోబర్ 3న ప్రారంభమైంది.
ఆ పేరు ఎందుకు వచ్చిందంటే..
హిమం అంటే మంచుకొండలు, సాగర్ అంటే సముద్రతీరం. అందుకే ఈ రైలుకు హిమసాగర్ అనినామకరణం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హిమాలయాల మంచుపర్వతాలకు సమీపంగా వెళ్లి.. అక్కడి నుంచి దక్షిణం వైపు కన్యాకుమారి సమీప హిందూ మహాసముద్రం వరకు రాకపోకలు సాగిస్తోంది.
అత్యధిక దూరం..
భారతరైల్వేలో అత్యధిక దూరం రాకపోకలు సాగించే రైళ్లు కొన్నే ఉండగా, ఇందులో హిమసాగర్ మూడోస్థానంలో ఉంటుంది. వివేక్ ఎక్స్‌ప్రెస్(22503/04): దిబ్రూగఢ్(అసోం)–కన్యాకుమారి(తమిళనాడు) మధ్య 4,154 కి.మీ. ప్రయాణిస్తుంది. అరోనాయ్ ఎక్స్‌ప్రెస్ : సిల్చార్(అసోం) – తిరువనంతపురం సెంట్రల్(తమిళనాడు) మధ్య 3,915 కి.మీ. రాకపోకలు సాగిస్తుంది. హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ : కన్యాకుమారి(తమిళనాడు) – జమ్ముతావి(జమ్మూ) మధ్య 3,790 కి.మీ. ప్రయాణం చేస్తుంది. నవయుగ్ ఎక్స్‌ప్రెస్(16687/88) : మంగళూర్ సెంట్రల్ (కర్ణాటక) – శ్రీమాతావైష్ణోదేవి కట్రా (జమ్మూ) మధ్య 3,607 కి.మీ. ప్రయాణిస్తుంది.
12 రాష్ట్రాల మీదుగా రాకపోకలు
హిమసాగర్ మనదేశంలోని పన్నెండు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇందులో జమ్మూకశ్మీర్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలున్నాయి. ఇది ఎక్కువగా ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల మీదుగా ప్రయాణం చేస్తుంది. దీంతో అత్యధిక ప్రయాణికులు పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తుంటారు. పన్నెండు రాష్ట్రాల్లో దీనికి 73 ప్రధాన రైల్వేస్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. సదరన్ రైల్వేజోన్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో హాల్టింగ్‌లు, కోచ్‌లు..
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట తదితర ప్రధాన రైల్వేస్టేషన్లలోనే హిమసాగర్ రైలుకు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దీనికి ఏసీ–2టైర్, ఏసీ త్రీటైర్, స్లీపర్‌క్లాస్, జనరల్ కోచ్‌లు ఉన్నాయి.
హిమపాతం నుంచి సాగరతీరం వరకు పరుగులు
హిమసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకత ఇది


