గోదావరిఖని: రామగుండం, భూపాలపల్లి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి తదితర ప్రాంతాల్లోని సింగరేణి బొగ్గు గని ఏరియా ల్లోని సుమారు 500 మందికిపైగా సింగరేణి గంగపుత్ర ఉద్యోగులు, విద్యావంతులు గోదావరిఖని సమీపంలోని గోదావరి నదీతీరంలో గల సమ్మక్క – సారలమ్మ గద్దెల వద్ద శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్య, సామాజిక వికాసం, భావితరాల విద్యాభివృద్ధి, నైపుణ్యాల పెంపు, ఉద్యోగ అవకాశాలు, హక్కుల సాధనలో విద్యావంతుల పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా సింగరేణి గంగపుత్రుల వేదిక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బంగారు రాజయ్య, ఉపాధ్యక్షులుగా అంబటి శ్రీనివాస్, పెద్దపల్లి పోచయ్య, మదనబోయిన రాజేందర్, వంగల చక్రపాణి, ప్రధాన కార్యదర్శిగా పూస వసంత్‌కుమార్ ఎన్నికయ్యారు. గంగపుత్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని, పేదవిద్యార్థుల ఉన్నత చదువులకు విద్యా సహాయ నిధి ఏర్పాటు చేయాలని, ప్రతీఏరియాలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని తీర్మానించారు.


