రామగుండం: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి మూడురోజులుగా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వతో జలకళ సంతరించుకుంది. నంది, గూడెం, వేంనూర్ తదితర పంపుహౌస్‌ల ద్వారా పలు జలాశయాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోస్తున్నారు.
20.119 టీఎంసీల నిల్వ..
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా, నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుతం(శనివారం) నీటిమట్టం 147.98 మీటర్లకు చేరుకోగా.. నిటినిల్వలు 20.119 టీఎంసీలకు చేరాయని అధికారులు వివరించారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 18,317 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రో నగరాలకు 258 క్యూసెక్కులు, నంది పంపుహౌస్‌కు 11,563 క్యూసెక్కులను భారీ పంపులతో ఎత్తిపోస్తున్నారు. పెద్దపల్లి, రామగుండం మిషన్ భగీరథకు 58 క్యూసెక్కులు, మంచిర్యాల భగీరథకు 23 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఆరంభం నుంచి ఈనెల 26వ తేదీన వరకు ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి దిగువ ఉన్న గోదావరిలోకి కేవలం 53.37 టీఎంసీలనే విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి భారీగా నీరువచ్చి చేరే సమయంలో ప్రాజెక్టు దిగువన గోదారి ఎడారిని తలపిస్తోంది.
జలాశయాలకు ఎత్తిపోతలు


