కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సిమ్స్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న రామగుండం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోనే పూర్తిస్థాయి వైద్యం అందాల్సిన రోగులు ఒక్కొక్కరుగా వరంగల్ ఎంజీఎంకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. గురువారం నలుగురు రోగులను వరుసగా ఎంజీఎంకు రెఫర్ చేయగా వారిని తరలించేందుకు కమాన్‌పూర్, అంతర్గాం, బసంత్‌నగర్, సుల్తానాబాద్ ప్రాంతాల నుంచి 108 అంబులెన్సులను రప్పించాల్సి వచ్చింది. ఒకేసారి నాలుగు అంబులెన్సులు బయటకు వెళ్లడంతో ఆ సమయంలో 108 అంబులెన్స్‌లు సేవలందించే ఆయా ప్రాంతాల పరిధిలో అత్యవసర కేసు వస్తే పరిస్థితి ఏంటన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
నలుగురూ వేర్వేరు సమస్యలతో..
న్యూరో సమస్యతో బాధపడుతున్న ఓ రోగిని కమాన్‌పూర్ 108 అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. గుండె సంబంధిత సమస్యలతో ఉన్న ముగ్గురు రోగులను వరుసగా అంతర్గాం, బసంత్‌నగర్, సుల్తానాబాద్ నుంచి వచ్చిన 108 అంబులెన్సుల్లో వరంగల్‌కు పంపించారు.
అనుబంధ ఆస్పత్రి నుంచే రెఫరల్స్ ఎందుకు?
మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్ బోధనాస్పత్రి. నిపుణులైన వైద్యులు, వైద్య విద్యార్థులకు శిక్షణ అందించే సౌకర్యాలు ఉన్నప్పటికీ రోగులను వరంగల్ ఎంజీఎంకు పంపించాల్సిన పరిస్థితి రావడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా గుండె సంబంధిత కేసులు వరుసగా రెఫర్ కావడంపై ఆస్పత్రిలో అత్యవసర వైద్యసేవల సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఒకేసారి నాలుగు 108లు బయటకు..
జీజీహెచ్ నుంచి నలుగురు రోగులను తరలించేందుకు సమీప మండలాల నుంచి 108 వాహనాలను సమీకరించాల్సి వచ్చింది. దీంతో స్థానికంగా అత్యవసర సేవలకు అంబులెన్స్ అందుబాటులో ఉండే పరిస్థితిపై ఆందోళన నెలకొంది. జీజీహెచ్‌కు వచ్చిన ప్రతీ అత్యవసర రోగికి సకాలంలో వైద్యం, అవసరమైతే తక్షణ తరలింపు సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
వరుసగా నలుగురు రోగుల రెఫరల్
అత్యవసర వేళ అంబులెన్స్ లేకపోతే పరిస్థితి ఏంటి?
ఆందోళన వ్యక్తం చేసిన
రోగుల బంధువులు


