న్యూస్‌రీల్
పెద్దపల్లి
ఆదివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2026
7
పెద్దపల్లిరూరల్: రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డులో పైరవీకారులదే పెత్తనం సాగుతోంది. పైసలు ముట్టజెబితేనే బీమా పరిహారం విడుదలవుతోంది. అధికారులకు నేరుగా దరఖాస్తు చేసుకునేవారికి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడమే దిక్కవుతోంది. ఇందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు కార్యాలయానికి చెందిన కొందరు అధికారులతో దళారులకు మంచి సంబంధాలు ఉండడమే కారణమని అంటున్నారు.
జిల్లా బాధ్యతలు దళారులకు..
జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మి కులు.. లేబర్‌కార్డు ద్వారా లబ్ధి పొందేందుకు అర్హతగల వారు దరఖాస్తులను నేరుగా కార్యాలయ అధి కారులకు అప్పగిస్తే.. వారికి సొమ్ము ఎప్పుడొస్తుందనేది దేవుడికే ఎరుక. కానీ రాష్ట్ర సంక్షేమ బోర్డులో ని కొందరు అధికారుల అండదండలున్న దళారులు పైరవీ చేస్తే కొద్దిరోజుల్లోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో పరిహారం సొమ్ము జమవుతోంది. కార్యాలయాల ద్వారా బోర్డుకు పంపించిన దరఖాస్తులు ఇప్పటికీ నెలల తరబడి పెండింగ్‌లో ఉండడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
పెండింగ్‌లోనే దరఖాస్తులు
భవన నిర్మాణ రంగంలో కార్మికుడిగా పనిచేస్తూ చనిపోయినా, గాయపడినా ఇతర ప్రయోజనాల కోసం సంబంధిత వ్యక్తులే నేరుగా కార్యాలయంలో దరఖాస్తు చేస్తే సంక్షేమబోర్డులోని అధికారులు కన్నెత్తికూడా చూడడం లేదనే విమర్శలున్నాయి. దీంతోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక శాఖ కార్యాలయాల్లో ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. దరఖాస్తుదారులు క్లెయిమ్‌ల పరిష్కారం కోసం లేబర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే అధికారులు, సిబ్బంది సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. అంటే కార్యాలయంలో క్లెయిమ్ కోసం దరఖాస్తు ఇస్తే ప్రయోజనం ఉండదని, ఆ లేబర్ ఆఫీసు పరిధిలోని దళారీకి ఎంతోకొంత ముట్టజెప్పి దరఖాస్తు పంపిస్తేనే పనవుతుందని విమర్శలున్నాయి. దీంతోనే దరఖాస్తుదారులు కొందరు దళారులను ఆశ్రయించి క్లెయిమ్‌లు పరిష్కారం చేయించుకుంటున్నారని అంటున్నారు.
పొరపాట్లు దొర్లితే ఇక అంతే..
కార్మిక శాఖ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను పొందేందుకు దరఖాస్తుదారులు తమబ్యాంకు ఖాతా వివరాలను రాసిన తర్వాత బ్యాంకులు విలీనం జరగడమో.. ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న ఖాతా నంబరు రాయడమో చేస్తే వాటిని సవరించేందుకు అవకాశం కూడా ఇవ్వడం లేదు. దరఖాస్తులను మూలనపడేయడంతో తమ పరిస్థితేంటని కొందరు బాధితులు అధికారులను ప్రశ్నించినా ఫలితం లేదని వాపోతున్నారు.
ఇప్పుడు ఆధార్ నంబరుతోనే చెల్లింపు
ఏడాది క్రితం వరకు డిమాండ్ డ్రాఫ్ట్, నెఫ్ట్ ద్వారా దరఖాస్తుదారులకు పరిహారం సొమ్ము చెల్లించేవారు. ఏడాదిగా ఆధార్ నంబరు నమోదు చేయడం ద్వారా దానికి అనుసంధానమైన బ్యాంకు ఖాతాలోనే సొమ్ము జమచేస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కార్మికాధికారి తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవచూపి తమకు వీలైనంత త్వరగా బీమా పరిహారం అందేలా చూడాలని కార్మిక శాఖ కార్యాలయాల ద్వారా సంక్షేమ బోర్డుకు పంపిన దరఖాస్తుదారులు కోరుతున్నారు.
‘సార్.. తాపీమేసీ్త్రగా పనిచేసే మా కుటుంబపెద్ద చనిపోయిండు.. కార్మిక బీమా పరిహారం కోసం దరఖాస్తు ఇచ్చినం.. నాలుగైదు నెలలైనా పైసా రాలే.. సొమ్ము ఎపుడొస్తుంది?’
– పెద్దపల్లి, మంథని, గోదావరిఖని లోని దరఖాస్తుదారుల వేదన
చేతులు తడిపితేనే బీమా సొమ్ము
నేరుగా దరఖాస్తు చేసుకుంటే నిరీక్షణే
తొమ్మిది నెలలుగా దరఖాస్తులన్నీ పెండింగ్
కార్మిక సంక్షేమ బోర్డు తీరుపై తీవ్ర విమర్శలు


