● సాగుపై ఎల్‌నినో ఎఫెక్ట్
● కంది సాగుతో మంచి దిగుబడి
● ఆగస్టులో నువ్వుల పంట కూడా బెటర్
● రైతు విజ్ఞానకేంద్రం కో ఆర్డినేటర్ ఓదెల సంపత్
పెద్దపల్లిరూరల్: జిల్లాలో వానాకాలం సాగుపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా రైతాంగం వరి సాగు చేయవద్దని శాస్త్రవేత్త, రైతువిజ్ఞాన కేంద్రం జిల్లా కో ఆర్డినేటర్ ఓదెల సంపత్ కోరారు. వరి సాగుకు అవసరమైనంత సాగునీరందని పరిస్థితి ఉందని, ఈ పంట సాగుచేసి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవడం మేలని అన్నారు. కంది సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు. ఆగస్టు 10 తర్వాత నువ్వుల పంట వేసుకోవాలని సూచించారు. రాగులు, సజ్జలు, జొన్నలు, ఉలవ, అలసంద పంటలైనా మంచిదేనని ఆయన చెప్పారు. ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు.


