వర్షం కురిసింది.. ధాన్యం తడిసింది | - | Sakshi
Sakshi News home page

వర్షం కురిసింది.. ధాన్యం తడిసింది

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

పెద్దపల్లిరూరల్‌/పెద్దపల్లి/ఓదెల/కాల్వశ్రీరాంపూ ర్‌: పొద్దంతా ఉక్కపోతతో జిల్లావాసులను ఉక్కిరిబిక్కిరి చేసిన వాతావరణం.. గురువారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయింది. హఠాత్తుగా కురిసిన వానతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరబోసి విక్రయిచేందుకు సిద్ధం చేస్తున్న వడ్లు వర్షపునీటిలో కొట్టుకుపోయాయి. ఈదురుగాలలు ధాటికి కొన్నిచోట్ల చెట్లు విరిగి పడడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

చివరిదశలో ధాన్యం, మక్కల కొనుగోలు

జిల్లాలోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కజొన్న కొనుగోళ్లు దాదాపు పూర్తయ్యాయి. తూకం వేసిన సంచులను గోదాములకు తరలించేందుకు లారీలురాక వాటిపై టార్పాలిన్లు కప్పేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. కప్పిన టార్పాలిన్లు సైతం భారీ గాలులకు కొట్టుకు పోయి ధాన్యం సంచులు తడిశాయని రైతులు ఆవేదన చెందారు. పెద్దపల్లి మార్కెట్‌లో మక్కజొన్నలను లోడ్‌ చేసిన లారీ తడవకుండా షెడ్‌లో నిలిపిఉంచగా పైకప్పు కూలి దానిపైనే పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడం తో ప్రమాదం తప్పింది. చెట్లు విరిగిపడ్డాయి. మహిళా పోలీస్‌స్టేషన్‌లో కారుపై చెట్టు విరిగిపడగా వెంటనే తొలగించారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారంలోనూ ధాన్యం వర్షపునీటిలో తడిసి ముద్దయ్యింది.

భోజన్నపేట, కనుకులలోనే అధికం

పెద్దపల్లి మండం భోజన్నపేట, సుల్తానాబాద్‌ మండలం కనుకులలోనే అత్యధికంగా 27 మి.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఓదెలలో 22మి.మీ., పెద్దపల్లి మండలం రంగంపల్లిలో 14.5మి.మీ., మండల కేంద్రమైన ముత్తారం, సుల్తానాబాద్‌ మండలం సుగ్లాంపల్లిలో 1.8మి.మీ. చొప్పున వర్షం కురవగా.. కాల్వశ్రీరాంపూర్‌లో 0.8 మి.మీ. వర్షపాతం నమోదైందని వివరించారు.

పొలాల్లోకి చేరిన వర్షపునీరు

ఓదెల మండలం గోపరపల్లె, ఓదెల, పొత్కపల్లి, కొలనూర్‌, నాంసానిపల్లె, మడక, ఇందుర్తి తదితర గ్రామాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీవర్షంతో పంట పొలాల్లోకి పెద్దఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో రేగడిభూముల్లో దుక్కులు దున్నటానికి రైతులు సిద్ధమయ్యారు. కాల్వశ్రీరాంపూర్‌ మండ లం కూనారం, కాల్వశ్రీరాంపూర్‌, పెగడపల్లి, గంగారం గ్రామాల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు ఆగమయ్యారు. కూనారంలో టార్పాలిన్‌ కవర్లు ఇవ్వలేదని ఆరోపించారు. గాలిదుమారానికి టార్పాలిన్‌ కవర్లు ఎగిరి పోవడంతో కొన్నికేంద్రాల్లో ధాన్యం తడిసింది.

కవర్లు ఇచ్చేవారే లేరు

కూనారం ఐకేపీ కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్‌ కవర్లు ఇచ్చే వారేలేరు. నిర్వాహకులు రాకపోవడంతో ఒక్కసారిగి వచ్చిన గాలివానకు ధాన్యం తడిసి పోయింది. రైతులపై అందరికీ చిన్నచూపే.

– పసుల ఐలు, రైతు, కూనారం

జిల్లావ్యాప్తంగా దంచికొట్టిన వాన

కొనుగోలు కేంద్రాల్లో నీటమునిగిన వడ్లు

లబోదిబోమంటున్న అన్నదాతలు

Advertisement
 
Advertisement
Advertisement