దిగ్విజయంగా అంజన్న ఆశీర్వాద యాత్ర కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు కాషాయమయం రాత్రి 10 గంటలకు కొండకు చేరుకుని మొక్కులు చెల్లించిన కేంద్రమంత్రి సంజయ్
కరీంనగర్/కొత్తపల్లి/రామడుగు/కొడిమ్యాల: ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం చేపట్టిన పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠాన్ని అప్పగిస్తే తన పార్లమెంట్ పరిధిలో ఎన్నికై న బీజేపీ ప్రజాప్రతినిధులందరితో కలిసి కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకుంటానన్న మాటను సంజయ్ నిలబెట్టుకున్నారు. దాదాపు 40 డిగ్రీల మండుటెండను సైతం లెక్క చేయకుండా వేలాదిమంది కార్యకర్తలతో కలిసి 40 కిలోమీటర్లు నడిచి రాత్రి 10 గంటలకు అంజన్న ఆలయ సన్నిధికి చేరుకున్నారు. బైంసా మున్సిపల్ ఛైర్మన్ తుమ్మల దత్తాత్రితోపాటు కౌన్సిలర్లంతా పాదయాత్రలో కలిసి నడిచారు.
ట్రాఫిక్ జాం కాకుండా యాత్ర
ఉదయం 9.30 గంటలకే పదో తరగతి పరీక్ష ఆరంభం కావడం... అదే సమయంలో సంజయ్ చేపట్టిన పాదయాత్ర కరీంనగర్ జగిత్యాల హైవేపైకి రావడంతో ట్రాఫిక్ జాం అవుతుందనే ఆందోళన కన్పించింది. పాదయాత్ర రక్షక దళం, ఇటు పోలీసుల సాయంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పాదయాత్రను కొనసాగించారు.
అడుగడుగునా నీరాజనం
నగరంలోని 23వ డివిజన్ సీతారాంపూర్‌లో మహిళలు మంగళహారతులు ఇచ్చి పూలవర్షం కురిపించారు. 19వ డివిజన్ రేకుర్తి చౌరస్తాలో
కార్పొరేటర్ సుదగోని మాధవికృష్ణగౌడ్ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. కొత్తపల్లి రామాలయం వద్దకు చేరుకోగాలనే కమిటీ సభ్యులు గజమాలతో సత్కరించారు. కొత్తపల్లి మార్కండేయ ఆలయం వద్ద 17,18 డివిజన్ల కార్పొరేటర్లు వేముల కవితచంద్రశేఖర్, వాసాల రమేశ్ స్వాగతం పలకగా, మహిళలు మంగళహారతులిచ్చి పూలవర్షం కురిపించారు. రామడుగు మండలం వెదిర, గంగాధర మండలంలోని పలు గ్రామాలతో పాటు కొడిమ్యాల మండలం పూడూరులో మంగళహారతులతో నీరాజనం పలికారు. తుర్కాశీనగర్ చేరుకోగానే ముస్లిం పెద్దలు, యువకులు ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి ఆహ్వానించారు. పూడూర్‌లో గజమాలతో స్వాగతం పలికారు.
తేనెటీగల కలకలం
యాత్ర రామడుగు మండలం కోనరావుపేట వద్దకు రాగానే.. కొందరు కార్యకర్తలు డ్రోన్ ఎగరేయడంతో చెట్టుపైనున్న తెనేతుట్టె కదిలింది. తేనెటీగల దాడిలో ముగ్గురు కార్పొరేటర్లు, మరో ముగ్గురు బీజేపీ శ్రేణులు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. పాదయాత్రలో డాక్టర్లు బండి సంజయ్‌కు సాధారణ హెల్త్ చెకప్ చేశారు.
గంగాధరలో లంచ్ బ్రేక్
గంగాధరలోని వీఏఎస్ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం 3.30 గంటలకు బీజేపీ శ్రేణులకు భోజన ఏర్పాట్లు చేశారు. బండి సంజయ్ సైతం అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో భోజనం చేసి కాసేపు సేదదీరారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. వెంకటాయపల్లి, పూడూరు, దొంగల మర్రి మీదుగా రాత్రి 10గంటల వరకు కొండగట్టు అంజన్న ఆలయం చేరుకుని ‘అంజన్న ఆశీ ర్వాద యాత్ర’ను దిగ్విజయంగా ముగించారు. సంజయ్ కొండకు చేరుకునే సమయానికి ఆలయం మూసివేయడంతో సింహద్వారం ఎదుట కొబ్బరికాయ కొట్టి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
యాత్ర ప్రారంభమైందిలా
శనివారం ఉదయం 7 గంటలకు బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో పూజలు నిర్వహించి అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభించారు. నూతనంగా ఎన్నికై న బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు వేలాది మంది కాషాయ శ్రేణులతో కలిసి కాలినడకన బయల్దేరారు. రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర కావడంతో సంజయ్ కేవలం సాక్సులతోనే నడక కొనసాగించారు.


