కోల్‌సిటీ(రామగుండం): నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణను సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులను రామగుండం మేయర్ మహంకాళి స్వామి ఆదేశించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం బల్దియా కార్యాలయ ఆవరణ శుభ్రపరిచే స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించి మాట్లాడారు. నిత్యం వందలాది మంది సందర్శించే బల్దియా పరిసరాలను శుభ్రంగా, కార్పొరేట్ కంపెనీ కార్యాలయం తరహాలో ఉంచాలన్నారు.
చెత్త బయటపడేస్తే జరిమానా
చెత్త బయట పడేసేవారికి జరిమానా విధిస్తామని మేయర్ స్వామి హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్ల య్య, కార్పొరేటర్ చిదురాల నాగరాజుతో కలిసి 52వ డివిజన్ కళ్యాణ్‌నగర్, కాకతీయనగర్‌లో పర్యటించారు. ఊర్వశి థియేటర్ సమీపంలోని మురుగునీటి కాలువల్లో పూడిక తొలగింపు పనులు పరిశీలించారు. కాలువ పరిసర ప్రాంతవాసుల ఇబ్బందులు తెలుసుకున్నారు. తమ వీధిలో రోడ్డు సరిగా లేదని కొంత మంది మేయర్ దృష్టికి తీసుకెళ్లగా, రెండునెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు పథకం అమలును ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, మొదట స్థలం ఉండి ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మాణం చేయిస్తున్నారని తెలిపారు. నగరపాలక డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎస్‌ఈ గురువీర, ఈఈ పీవీ రామన్, డీఈ షాభాజ్, ఏఈలు తేజస్విని, జమీల్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


