వ్యవసాయశాఖపై ఏసీబీ నజర్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయశాఖపై ఏసీబీ నజర్‌

Mar 2 2026 7:38 AM | Updated on Mar 2 2026 7:38 AM

వ్యవసాయశాఖపై ఏసీబీ నజర్‌

వ్యవసాయశాఖపై ఏసీబీ నజర్‌

పెద్దపల్లిరూరల్‌: రైతులకు సేవలందించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు తమ విధులపై నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయాన్ని అవినీతి అధికారులు జరిపిన తనిఖీల్లో తేల్చేదాకా డివిజన్‌, జిల్లా స్థాయి అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారన్న ప్రశ్న స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత నెల 24న అవినీతి నిరోధక శాఖ అధికారులు మండల వ్యవసాయాధికారి కార్యాలయంలో సోదాలు నిర్వహించి అధికారి పనితీరులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సకాలంలో ఫైళ్లను పరిష్కరించలేకపోయారని, యూపీఐ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ తేల్చారు. దీంతో మండల వ్యవసాయాధికారిని కలెక్టర్‌ సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

అధికారుల మధ్య విభేదాలేనా..?

పెద్దపల్లి మండల వ్యవసాయాధికారి కార్యాలయ భవనంలోకి ఏడీఏ ఆఫీసును మార్చడం.. ఒకే గదిలో మండల, డివిజన్‌ స్థాయి అధికారులు పనిచేయడంలో విభేదాలున్నాయా.. అన్న చర్చ స్థానికంగా జోరుగా సాగుతోంది. దీనికి తోడు విత్తన, ఎరువుల డీలర్లకు సర్టిఫికెట్‌ కోర్సు (డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ సర్వీసెస్‌ ఫర్‌ ఇన్‌పుట్‌ డీలర్స్‌) దేశీ (డీఏఈఎస్‌ఐ) శిక్షణ సమయంలో అభ్యర్థుల నుంచి వసూలు చేసిన పంపకాల్లో వచ్చిన తేడాలతో తలెత్తిన అభిప్రాయ భేదాలు ముదిరినట్టుగా తెలుస్తోంది. ఏవో ఆఫీసుకు పనుల నిమిత్తం వచ్చే డీలర్లు, రైతులు, సంఘ నాయకులతో ఉన్న పరిచయాలను బట్టి కొంత మొత్తాలను అప్పుగా తీసుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో విత్తన, ఎరువుల డీలర్లు సైతం వర్గాలుగా చీలి, ఒక్కో అధికారికి వత్తాసు పలకడం కూడా వారి మధ్య విభేదాలకు ఆజ్యం పోసినట్లయిందని సమాచారం. జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో వారంలో రెండుమూడు సార్లు జూమ్‌ మీటింగ్‌, సమీక్షలు నిర్వహిస్తుంటారని, ఆ సమయంలో పనుల పురోగతి పెండింగ్‌ ఫైళ్ల విషయం చర్చకు వస్తుండేదన్న అభిప్రాయాలు కొందరు రైతులు, సంఘ నాయకులు పేర్కొంటున్నారు. ఏసీబీ అధికారులు ఏవో ఆఫీసులో సోదాలు నిర్వహించిన తర్వాత.. తమ కార్యాలయాల్లోనూ తనిఖీలు ఉంటాయా..అన్న డోలాయమానంలో ఆ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ఉన్నట్టు సమాచారం. కొందరు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోతేనే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఆరేళ్ల క్రితం ఏసీబీకి చిక్కిన ఏడీఏ

ఇటీవల ఏవో ఆఫీసులో తనిఖీలు

ఒకే ఆవరణలో ఏడీఏ, ఏవో కార్యాలయాలు

అధికారుల నడుమ విభేదాలే కారణమా?

ఆరేళ్ల కిందట ఏడీఏ పట్టివేత

ఆరేళ్ల క్రితం పెద్దపల్లి ఏడీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఓ లైసన్సు జారీ చేసే విషయంలో కొంత మొత్తాన్ని డిమాండ్‌ చేసి తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ సమయంలోనే ఏవో ఆఫీసులోనూ సోదాలు చేసేందుకు యత్నించినా సదరు అధికారి అందుబాటులో లేకపోవడంతో ఆ యత్నాలు ఫలించలేదు. కానీ, ఈసారి మాత్రం ఏసీబీ అధికారులకు అందిన ఫిర్యాదుల ఆధారంగా ఆకస్మికంగా తనిఖీలు చేసి రికార్డులు పరిశీలించారు. రైతులకు సరైన రీతిలో సేవలందించలేదని, రికార్డుల నిర్వహణ సరిగాలేదని, ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని తనిఖీల్లో గుర్తించినట్టు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement