ఉచిత శిక్షణ.. స్వయం ఉపాధి
పెద్దపల్లిరూరల్: మహిళలు ఆర్థికాభ్యున్నతి సాధించి తమ కాళ్లపై తాము నిలబడేలా చేసి, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు విశ్వహిందూపరిషత్ సహకారంతో విశ్వహిత సేవాట్రస్ట్ నిర్వాహకులు ఉచిత కుట్టుశిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల, బెల్లంపల్లి, కరీంనగర్, రాంనగర్ (కరీంనగర్), జగిత్యాలలో కుట్టుశిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తున్నారు.
మూడు నెలల పాటు శిక్షణ
కుట్టు పని నేర్చుకునేందుకు ముందుకు వచ్చే ఆసక్తిగల మహిళలను ఎంపిక చేసి వారికి మూడు నెలలపాటు ఉచితంగా కుట్టుశిక్షణ ఇస్తున్నారు. పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రంలో తొలిబ్యాచ్‌లో 25మంది, రెండో బ్యాచ్‌లో 37మందికి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం మూడో బ్యాచ్‌లో ఎంపికై న 36మంది మహిళలకు శిక్షణ సాగుతోంది. మహిళలు, చిన్నారులు, యువతులు ధరించే దుస్తుల తయారీలో పూర్తిస్థాయి శిక్షణ పొందిన మహిళల్లో సమాజంలో తాము నిలబడగలమనే విశ్వాసం మెండుగా కనిపిస్తోంది.
మహిళా స్వావలంబనే లక్ష్యంగా ముందుకు
విశ్వహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు తర్ఫీదు


