పైసలుంటేనే పోటీ
గోదావరిఖని: కార్పొరేటర్‌గా పోటీచేసే ఒక్కో అభ్యర్థి ఈసారి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒక్కోడివిజన్‌లో 2,500 వరకు ఓట్లు ఉంటే.. ఒక్కొక్కరికి కనీసం రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేయాల్సి వస్తుందని, ఇంత సొమ్మ పంపిణీ చేసినా ఒకవేళ ఓడిపోతే ఎలా? అని ప్రధాన పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు.
సాధించేదేముంటుందని..
పోటీచేద్దామనే ఆశ ఉన్నా.. చేతిలో డబ్బులేని కొందరు నాయకులు పోటీకి దూరంగా ఉంటున్నారు. ఒకవేళ అంతగా ఖర్చుచేసి సంపాదించేదెలా? అని మదనపడుతున్నారు. ఇలాంటి సవాలక్ష ప్రశ్నలతో చాలామంది సీనియర్లు వెనక్కి తగ్గుతున్నారు. ఈసారి నామినేషన్ల తీరు చూస్తే ఈ పరిస్థితి అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రధాన పార్టీల్లోనూ ఇలాగే..
ప్రధాన పార్టీల్లోని కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో ఆశించినంత వెచ్చించలేక, పోటీనుంచి వెనక్కి రాలేక సతమతమవుతున్నారు. ఒక్కోఓటుకు కనీసం రూ.వెయ్యి చొప్పున 2,500 ఓట్లకు లెక్కేసినా సుమారు రూ.25లక్షలు, ఎన్నికల ఖర్చులు మరో రూ.10లక్షలు.. ఇలా సుమారు రూ.35లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుందని అంచనా వేసుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ అనే తేడాలేకుండా అన్ని పార్టీల్లో ఆశావహుల్లో ఈమేరకు కొంత భయం పట్టుకుందని అంటున్నారు.
మారిన ఓటరు వైఖరి..
ఒకప్పుడు ఓటు కోసం నాయకులు ఇళ్ల వద్దకు మద్యం మాంసం తదితర నజరానాలు పంపించేవారు. ఇప్పుడు ఓటర్లే డిమాండ్ చేసే పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. తెల్లవారితే పోలింగ్ ఉంటుందనగా.. కొందరు అర్ధరాత్రివరకూ మెలకువగా ఉండి నజరానాల కోసం నిరీక్షించినట్లు పేర్కొంటున్నారు. ఒకరిద్దరు అభ్యర్థుల నుంచే కాకుండా అన్ని పార్టీల అభ్యర్థుల నుంచి ఓటర్లు నజరానా తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అభ్యర్థులు పెద్దమొత్తంగా వ్యయం చేయాల్సి వస్తోంది. గెలిచిన అభ్యర్థుల మాట అటుంచితే.. ఓడినవారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. మారిన ఓటరు తీరుతో చాలామంది అభ్యర్థులు ఈసారి బల్దియా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. మరికొంత మంది పోటీలో ఉంటున్నా.. ఆచీతూచి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల11న మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగా.. అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఓటర్లు మాత్రం నజరానాల అంచనాల్లో తలమునకలై ఉన్నారు.
ఖరీదైన బల్దియా ఎన్నికలు
కనీసం రూ.35 లక్షల వరకు ఖర్చు
బరిలో నిలిచేందుకు సీనియర్లు వెనుకంజ
దూరంగా ఉంటున్న ప్రధాన పార్టీల్లోని ఆశావహులు
పైసలుంటేనే పోటీ


